Share News

Transport Scam: రవాణాశాఖలో బ్రేకుల్లేని అవినీతి

ABN , Publish Date - Jan 01 , 2026 | 08:11 AM

నిన్న మహబూబ్‌నగర్‌.. మొన్న ఖమ్మం.. అంతకుముందు వరంగల్‌, ఇతర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో రవాణా శాఖ అధికారులు పట్టుబడుతున్నారు.

Transport Scam: రవాణాశాఖలో బ్రేకుల్లేని అవినీతి

  • ఏసీబీకి పట్టుబడ్డ అధికారులపై శాఖాపరమైన విచారణ ఏదీ?

  • అవినీతి కేసుల్లో సస్పెండై.. జైలుకు వెళ్లొచ్చినా తిరిగి దర్జాగా విధుల్లోకి..

  • ఆపై కీలక పోస్టింగ్‌లు, పదోన్నతులు

  • రవాణా శాఖలో కీలక విభాగాల అధికారుల అక్రమార్జన రోజు లక్షల్లో..

  • ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వసూళ్లు.. ఫైళ్లపై ‘కోడ్‌’ వేశాకే సంతకం

  • రెండేళ్లల్లో 5గురు కమిషనర్ల మార్పుతో కొందరు అధికారుల చేతుల్లో పెత్తనం

హైదరాబాద్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): నిన్న మహబూబ్‌నగర్‌.. మొన్న ఖమ్మం.. అంతకుముందు వరంగల్‌, ఇతర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో రవాణా శాఖ అధికారులు పట్టుబడుతున్నారు. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నవారు కొందరైతే ప్రైవేటు వ్యక్తుల్ని నియమించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నవారు మరికొందరు. ఏసీబీ తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మేలా ఆయా అధికారుల అవినీతి సొమ్ము బయటపడుతున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం కళ్లు మూసుకుని కనీస విచారణ చేపట్టకపోవడం సందేహాలకు తావిస్తోంది. పైగా వారిని తిరిగి విధుల్లోకి తీసుకుని.. పదోన్నతులు, కీలక స్థానాలు కట్టబెడుతున్నారు. ఏసీబీ కేసులున్నా పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ కూడా నిరాటంకంగా అందుతోంది. ఏదైనా కేసులో అరెస్టైన, ఆరోపణలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై శాఖాపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కోర్టులో ఆ కేసు వీగిపోయినా శాఖాపరమైన విచారణలో ఆ ఉద్యోగి తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటారు. అన్ని విభాగాల్లో ఇదే పద్ధతి అవలంబిస్తున్నా రవాణా శాఖలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. శాఖాపరమైన విచారణ లేకపోగా అవినీతి కేసులో జైలుకెళ్లిన అధికారి కొద్ది నెలల్లోనే తిరిగి కీలక పోస్టింగు సంపాదించుకుంటున్నారు. తమను ఎవరూ ఏం చేయలేరన్నట్లు మరింత అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


ప్రస్తుతం మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ)గా పనిచేస్తున్న అధికారి అసిస్టెంట్‌ ఎంవీఐగా ఉన్నప్పుడు ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ తర్వాత ఎలాంటి విచారణ లేకుండా తిరిగి విధుల్లో చేరి ఎంవీఐగా పదోన్నతి పొందారు. సూర్యాపేటలో పనిచేస్తుండగా మరో రెండుసార్లు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కీలకమైన చోట ఎంవీఐగా కొనసాగుతున్నారు. తిరుమలగిరి ఆర్టీవో అవినీతి కేసులో ఏసీబీకి పట్టుబడినా ఎలాంటి విచారణ లేకుండా తిరిగి విధుల్లో చేరారు. అత్యంత కీలకమైన ప్రాంతంలోని ఓ ఎంటీవోపై మూడు ఏసీబీ కేసులు ఉన్నా కనీస విచారణ లేకుండా కొనసాగుతున్నారు. అవినీతి కేసులో పట్టుబడ్డ ఓ క్లర్క్‌.. శాఖాపరమైన విచారణ లేకుండా తిరిగి విధుల్లో చేరి సీనియర్‌ క్లర్క్‌గా పొందారు. ఇలా చెప్పుకుంటూపోతే రవాణా శాఖలో పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు ఉన్నా తిరిగి పోస్టింగ్‌లు, పదోన్నతులు పొందుతున్నారు.


‘కోడ్‌’లతో రోజూ లక్షల్లో సంపాదన!

రవాణా శాఖలో కీలక విభాగాల్లో పనిచేసేవారు, ప్రత్యేకించి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయ అధికారులు కొందరి అక్రమ సంపాదన రోజుకు లక్షల్లో ఉంటోంది. సాయంత్రం ఆఫీస్‌ నుంచి ఇంటికి అక్రమార్జనను మూటగట్టుకుని వెళ్తున్నారు. ఇటీవల ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ఇన్‌చార్జి అధికారిపై ఏసీబీ కేసు సమయంలో ఈ విషయం బహిర్గతమైంది. ఏసీబీ అధికారులు ఆర్టీవో కార్యాలయంపై దాడికి ముందే ఏజెంట్ల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. వందల సంఖ్యలో వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీ కార్డులు, ఆఫీస్‌ రికార్డులు ఏజెంట్ల వద్ద ఉండటాన్ని గుర్తించారు. ఫైళ్లు నేరుగా అధికారి వద్దకు కాకుండా అతను నియమించుకున్న ప్రైవేటు వ్యక్తి వద్దకు వెళుతున్నాయి. అక్కడ ‘కోడ్‌’ వేసిన తర్వాతే అధికారి టేబుల్‌పైకి వస్తున్నాయి. ప్రతి రోజూ ఏజెంట్ల వద్ద నుంచి సుమారు రూ.1.50 లక్షలు వసూలు చేసి అధికారికి అప్పగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒక్క ఖమ్మంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అనతికాలంలోనే రవాణా శాఖ అధికారులు భారీగా సొమ్ము వెనకేసుకుంటున్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడ్డ మహబూబ్‌నగర్‌ డీటీసీ ఆస్తులు రూ.200 కోట్లు ఉంటాయని అంచనా. ఆయన బ్యాంకు బ్యాలెన్స్‌ రూ. 1.37 కోట్లు, కేజీ బంగారం, 31 ఎకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల వాణిజ్య భూమి, లహరి హోటల్‌లో 50 శాతం వాటా ఉన్నట్లు తేలింది. ఏసీబీ లోతైన విచారణలో బినామీ పేర్లతో కూడబెట్టిన ఆస్తుల వివరాలు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


రెండేళ్లలో ఐదుగురు కమిషనర్లు

ఉన్నతాధికారుల అజమాయిషీలోపం కూడా అవినీతి అధికారులకు అవకాశంగా మారింది. రవాణా శాఖలో రెండేళ్లలో ఐదుగురు కమిషనర్లు మారారు. జ్యోతి బుద్ధప్రసాద్‌, ఇలంబర్తి, సురేంద్ర మోహన్‌, రఘునందన్‌, తిరిగి ఇప్పుడు ఇలంబర్తి మళ్లీ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఐదుగురిలో సురేంద్ర మోహన్‌ ఒక్కరే ఎక్కువకాలం కొనసాగారు. రఘునందన్‌ కేవలం నెలన్నర రోజులు మాత్రమే ఉన్నారు. ఎప్పటికప్పుడు కమిషనర్లు మారుతుండటం, వారికి శాఖపై పూర్తి పట్టులేకపోవడం కూడా అవినీతి అధికారులకు కలిసి వచ్చే అంశంగా మారింది. మరోవైపు కమిషనర్లకు పట్టులేకపోవడంతో కొందరు అధికారుల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమైందనే ఆరోపణలు వస్తున్నాయి. వారి కనుసన్నల్లోనే పోస్టింగ్‌లు, పదోన్నతులు జరుగుతున్నాయని సమాచారం.

Updated Date - Jan 01 , 2026 | 08:12 AM