Share News

ఐఐటీహెచ్‌ 588

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:08 AM

ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల జాబితా(క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌)లో.. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ 588వ గ్లోబల్‌ ర్యాంకు సాధించింది.

ఐఐటీహెచ్‌  588

  • క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో విద్యాసంస్థ స్థానమిదీ..

  • జాబితాలోని టాప్‌-200 విద్యాసంస్థల్లో మనదేశానికి చెందిన మూడింటికే చోటు

  • 851-900 బ్యాండ్‌లో హెచ్‌సీయూ

  • మొత్తం 1504 విద్యాసంస్థల్లో మనవి 52

  • దేశంలోని 20ఐఐటీల్లో పన్నెండింటికి చోటు

కంది, హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల జాబితా(క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌)లో.. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ 588వ గ్లోబల్‌ ర్యాంకు సాధించింది. అలాగే.. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 851-900 బ్యాండ్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచ స్థాయి విద్యాప్రమాణాలు, కరిక్యులమ్‌, నాణ్యమైన విద్య వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటిస్తారు. ఐఐటీహెచ్‌ ర్యాంకు ఈసారి నిరుటి కంటే 76 స్థానాలు మెరుగుపడిందని (2026 ర్యాంకింగ్స్‌లో 664వ స్థానంలో నిలిచింది) వర్సిటీ అధికారులు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అలాగే.. పరిశోధనల్లో గ్లోబల్‌ రేంజ్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు 123వ స్థానం దక్కిందని పేర్కొన్నారు. 2008లో ప్రారంభమైన ఐఐటీ హైదరాబాద్‌ 17 ఏళ్లలోనే దేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని సంస్థ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు. ఈ పురోగతి తమ పరిశోధన, డీప్‌టెక్‌ ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధికి గుర్తింపు అని ఆయన గుర్తుచేశారు. ఈ విజయం అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, యాజమాన్యం సమష్టి కృషి ఫలితమని క్యూఎస్‌ ర్యాంకింగ్‌ సమన్వయకర్త డాక్టర్‌ సౌరభ్‌ శాండిల్య పేర్కొన్నారు. ఇక.. ఈ జాబితాలో చోటు సాధించడం, తమ ర్యాంకు నిలకడగా ఉండడం.. తమ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల అవిశ్రాంత అంకితభావానికి నిదర్శనమని హెచ్‌సీయూ వీసీ అనూరాధ అన్నారు. కాగా.. క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ జాబితాలోని టాప్‌-200 విద్యాసంస్థల్లో ఐఐటీ ఢిల్లీ (118వ ర్యాంకు), ఐఐటీ బాంబే (134వ ర్యాంకు), ఐఐటీ మద్రాస్‌ (170వ ర్యాంకు) మాత్రమే ఉన్నాయి.


వీటిలో ఐఐటీ ఢిల్లీ గత ఏడాది 123వ స్థానంలో నిలవడం గమనార్హం. దేశంలోని మొత్తం 20 ఐఐటీల్లో పన్నెండు ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. అమెరికాలోని మస్సాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రపంచస్థాయిలో 1వ స్థానాన్ని వరుసగా 15వసారి నిలబెట్టుకుంది. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌, స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీలు ఉమ్మడిగా 2వ స్థానంలో నిలిచాయి. మొత్తం 1504 విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటించగా.. అందులో అత్యధికంగా అమెరికాకు చెందిన 184 విద్యాసంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.. యూకే (93), చైనా (85), జర్మనీ (60) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక మన దేశానికి చెందిన 52 విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో 26 గత ఏడాది కంటే తమ స్థానాలను మెరుగుపరుచుకోగా.. తొమ్మిది విద్యాసంస్థలు గత ఏడాది ర్యాంకులనే సాధించాయి. 15 విద్యాసంస్థల ర్యాంకులు నిరుటి కన్నా తగ్గాయి. రెండు విద్యాసంస్థలు (ఐఐటీ ధన్‌బాద్‌, భారతీయార్‌ యూనివర్సిటీ) కొత్తగా ఈ జాబితాలో చోటు సాధించాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎంప్లాయబిలిటీలో కార్పొరేట్‌ కంపెనీలు మెచ్చిన విద్యాసంస్థల విభాగంలో అమెరికాలోని అనేక దిగ్గజ వర్సిటీలను అధిగమించి మన దేశానికి చెందిన ఐఐటీ బాంబే 32వ స్థానంలో, ఐఐటీ ఢిల్లీ 39వ స్థానంలో నిలవడం గమనార్హం. ప్రపంచ ఓవరాల్‌ ర్యాంకింగుల్లో భారత వర్సిటీలు/విద్యాసంస్థలు టాప్‌-100లో లేకున్నా.. పరిశోధనలు, ఉద్యోగాల కల్పనలో మాత్రం టాప్‌-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Updated Date - Jun 19 , 2026 | 03:08 AM