Share News

క్యూనెట్‌ వలలో టెకీల విలవిల

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:58 AM

డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మనీ సర్క్యులేషన్‌ స్కీములు పెట్టి.. వేలమందిని ముంచి, రూ.వందల కోట్లు స్కాములకు పాల్పడుతున్న క్యూనెట్‌ మోసాలపై ఇటీవల పోలీసులు ఉక్కుపాదం మోపారు.

క్యూనెట్‌ వలలో టెకీల విలవిల

  • రుణాలిప్పించి మరీ డబ్బులు కట్టించిన కేటుగాళ్లు

  • 500 మంది చొప్పున చేర్పించిన 32 మంది నిందితులు

  • 8 అప్పుల ఊబిలో వందల కుటుంబాలు

  • సిట్‌ విచారణలో విస్తుపోయే విషయాలు

  • 8 నిందితుల అరెస్టు.. వారిలో 10 మంది సిట్‌ కస్టడీకి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మనీ సర్క్యులేషన్‌ స్కీములు పెట్టి.. వేలమందిని ముంచి, రూ.వందల కోట్లు స్కాములకు పాల్పడుతున్న క్యూనెట్‌ మోసాలపై ఇటీవల పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీసీఎస్లో 4 కేసులు నమోదు చేసి మల్టీలెవల్‌ మోసంలో భాగస్వాములై వందల మందిని చేర్పించిన 32 మంది నిందితులను అరెస్టు చేశారు. మోసపోయిన బాధితులు వేలల్లో ఉండటం, రూ. వందలకోట్లు స్కామ్‌ జరిగినట్లు ప్రాథమికంగా తేలడంతో సిటీ సీపీ సీసీఎస్‌ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)ను ఏర్పాటు చేశారు. క్యూనెట్‌ మోసాల్లో అరెస్టయిన 32 మంది నిందితుల్లో మొదటి విడతగా పది మందిని సిట్‌ అధికారులు ఐదు రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు వారిని విచారిస్తున్న క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఐటీ కంపెనీల్లో, ఖరీదైన హోటళ్లలో నిర్వాహకులు ఆకర్షణీయమైన సెమినార్లు నిర్వహించిన అనంతరం.. ఒక్కో నిందితుడు సుమారు 500 మంది వరకు టెకీలను చేర్పించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కస్టమర్లను చేర్పించే క్రమంలో.. పెట్టుబడి పెట్టడానికి డబ్బుల్లేని ఐటీ ఉద్యోగులకు నిందితులే ఏజెంట్లుగా వ్యవహరించి బ్యాంకుల నుంచి రుణాలిప్పించారు. ఆ డబ్బునే పెట్టుబడులుగా తీసుకున్నారు. రూ.5లక్షల నుంచి 10 లక్షలు పెట్టుబడిగా పెట్టండి.. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే లాభాల రూపంలో రూ.3-4 కోట్లు సంపాదించండి అంటూ టెకీలకు ఆశపెట్టారు. అయితే పెట్టుబడుల పేరుతో డబ్బులు చేతికొచ్చాక కేటుగాళ్లు ముఖం చాటేశారు. అప్పులు తీసుకొని ఇన్వెస్టిమెంట్‌ చేసిన వందలమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు.. ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తున్నారు. కానీ క్యూనెట్‌లో పెట్టిన డబ్బులకు ఎలాంటి లాభాలు ఇవ్వకపోవడం, ఒకవేళ కమీషన్‌ రావాలంటే వారు కూడా మరికొందరిని ఈ ఊబిలోకి దింపాల్సిన అవసరం ఉందని తేలడంతో బాధితులు అవాక్కయ్యారు.


ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 32 మంది నిందితుల ద్వారా క్యూనెట్‌ వలలో చిక్కిన వేలమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు రూ.లక్షల్లో అప్పులు తీసుకొని.. ఆ అప్పులు తీర్చేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. కాగా స్కీములో చేరిన తర్వాత బాధితుల డబ్బులు చేతికందగానే ఒక బాండు రాయించుకుంటున్న నిర్వాహకులు వారి కంటిని వారి చేతనే పొడిచేలా పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వయంగా, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ఈ సంస్థలో సభ్యుడిగా చేరాను. పెట్టుబడులు పెట్టాను. ఇందులో ఎవరి ప్రమేయం, ప్రోద్బలం లేదు. సంస్థలో జరిగే అన్ని విషయాలకు నేను బాధ్యత వహిస్తాను అని బాండు రాయించుకుంటున్నారు. మోసపోయిన బాధితులు.. మోసం తెలిసిన తర్వాత ఎదురు తిరిగితే పోలీస్‌ కేసులు పెట్టి కోర్టుకు ఈడుస్తామని నిర్వాహకులే ఉల్టా బెదిరిస్తున్నారు. ఫలితంగా చేసేదేమీ లేక బాధితులంతా మిన్నకుండి పోతున్నారని, మానసికంగా కుంగిపోతున్నారని సిట్‌ విచారణలో తేలింది.

Updated Date - Apr 04 , 2026 | 04:58 AM