దేశ ప్రగతిలో పీవీ పాత్ర మరువలేనిది
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:39 AM
దేశ ప్రగతిలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పాత్ర మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ చరిత్రలోనే ....
పీవీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళి
ఆయన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు : ఖర్గే
పీవీకి గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాళి
పీవీ సమాధి వద్ద నివాళులర్పించిన ప్రముఖులు
న్యూఢిల్లీ, హైదరాబాద్, రాంగోపాల్‌పేట్, రవీంద్రభారతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రగతిలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పాత్ర మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన తరుణంలో ఆయన అందించిన సేవలు గొప్పవన్నారు. పీవీ 105వ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. పీవీ ఆర్థిక సంస్కర ణలు దేశ ప్రగతికి బాటలుగా మారాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక ఆర్థిక సరళీకరణ విధానాలు దేశ వృద్ధిని వేగవంతం చేశాయంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వి హంచిన వేడుకల్లో రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ పీవీకి నివాళుల ర్పించారు. ఇటు హైదరాబాద్‌లో సీఎం రేవంత్ తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో పీవీకి నివాళులర్పించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ లాబీ హాల్లో ఉన్న పీవీ చిత్రపటానికి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, పీవీ కుమార్తె సురభి వాణీదేవి తదితరులు నివాళులర్పించారు. గాంధీభవన్‌లో పీవీ చిత్రపటానికి టీపీసీసీ ఉపాధ్య క్షుడు కుమార్‌రావు నివాళులర్పించారు. నెక్లెస్‌రోడ్డులోని పీవీ సమాధి వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో నాడు ప్రతిపక్ష నాయకుడైనవాజ్‌పేయ్‌ని దేశానికి ప్రాతినిఽధ్యం వహించ డానికి ఐక్యరాజ్యసమితి సదస్సుకు పంపడం ఆయన గొప్పదనమన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు, తదితరులు పీవీకి నివాళులర్పించారు.
పీవీ దూరదృష్టితోనే నేటి సుసంపన్న భారతం
దేశ ఆర్థిక సంస్కరణల శిల్పిగా పీవీ వేసిన పునాదులపైనే నేటి సుసంపన్న భారతం నిలిచిందని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొనియాడారు. రవీంద్రభారతిలో పీవీ జయంతి వేడుకలకు హాజరైన ఆయన పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నటుడు, నిర్మాత మురళీమోహన్, పీవీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా.ఎన్.వి.సుధాకిరణ్ తదితరులు పాల్గొన్నారు.