Share News

దళారులకు చెక్‌

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:03 AM

వాహనం నడపాలంటే లైసెన్స్‌ తప్పనిసరి. తొలుత లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకొని ఆ తర్వాత ఆరు నెలల్లోగా పర్మినెంట్‌ లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్‌ కోసం రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉండగా.. కొన్నిచోట్ల ఉద్యోగుల తీరు, ఇంకొన్ని సార్లు వాహనదారులకు అవగాహన లేక దళారులను ఆశ్రయించాల్సి

దళారులకు చెక్‌

జగిత్యాల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): వాహనం నడపాలంటే లైసెన్స్‌ తప్పనిసరి. తొలుత లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకొని ఆ తర్వాత ఆరు నెలల్లోగా పర్మినెంట్‌ లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్‌ కోసం రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉండగా.. కొన్నిచోట్ల ఉద్యోగుల తీరు, ఇంకొన్ని సార్లు వాహనదారులకు అవగాహన లేక దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా అటు శాఖకు చెల్లించే ఫీజుతోపాటు అదనపు భారం పడుతోంది. దీన్ని కట్టడి చేసేలా లెర్నింగ్‌ లైసెన్స్‌ కోసం ఆన్‌లైన్‌లో పరీక్షకు హజరయ్యే విధానాన్ని అందుబాటులోకి తీసుకొనున్నారు.

ఆన్‌లైన్‌ సేవలు..

అన్ని శాఖల్లో మాదిరిగానే రవాణా శాఖలోనూ ఆన్‌లైన్‌ సేవల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాహనపోర్టల్‌ను ప్రవేశపెట్టాయి. అందులో భాగంగా దళారులకు చెక్‌పెట్టేలా సేవలు అందుబాటు లోకి వచ్చాయి. ఇప్పుడు వాహనదారులు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లే పనిలేకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరై లెర్నింగ్‌ లైసెన్స్‌ పొందే వెసులుబాటు లభించనుంది. ప్రస్తుతం జగిత్యాల, కోరుట్ల కార్యాలయాల్లో నిత్యం 40, 50మంది లెర్నింగ్‌ లైసెన్స్‌ పొందుతున్నారు.

ఇదీ విధానం..

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన్‌ పోర్టల్‌ సారథిలో రాష్ట్ర ప్రభుత్వం సైతం భాగస్వామ్య మైంది. దీంతో వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటినుంచి ల్యాప్‌టాప్‌, కంపూటర్‌తో ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో పరీక్ష రాయొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే లెర్నింగ్‌ లైసెన్స్‌ లభిస్తుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

ఆన్‌లైన్‌ పరీక్షలో ఇతరుల సాయం తీసుకోవడం కానీ, పుస్తకాలు చదివే అవకాశం కానీ ఉండదు. ఇందుకోసం సారథి సిస్టమ్‌లో అత్యంత పటిష్టమైన ఏఐ సెక్యూరిటీ ఫీచర్లను పొందుపర్చారు. ప్రస్తుత విధానంలో రవాణాశాఖ పోర్టల్‌లో ఫీజు చెల్లించి ఆర్‌టీఏ కార్యాలయంలో జరిగే పరీక్షకు హాజరు కావాలి. అక్కడ ఉన్న కంప్యూటర్‌లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధిస్తే లైసెన్స్‌ జారీ చేస్తారు. ఇప్పుడు కూడా అదే మాదిరి స్లాట్‌ బుక్‌ చేసుకుని ఇంటి నుంచే పరీక్షకు హాజరు కావొచ్చు. పరీక్ష కోసం లాగిన్‌ కాగానే వెబ్‌క్యామ్‌ ద్వారా ఏఐ సాంకేతికత అభ్యర్థి ముఖాన్ని స్కాన్‌ చేస్తుంది. దరఖాస్తులో ఇచ్చిన ఫోటోతో ఇది వందశాతం సరిపోలితేనే అనుమతిస్తుంది. అలాగే దరఖాస్తు దారులే కెమెరా ముందు ఉన్నారా, మరొకరి ఫోటో పెట్టడం కానీ ఇతరులు హాజరయ్యారా అని తేల్చేందుకు పరీక్ష నిర్వహిస్తుంది. ఈ మేరకు అయిదు సార్లు నవ్వడం, అయిదు సార్లు కంటి రెప్పలు ఆడించాలని సూచించి అంతా సక్రమంగా ఉంటేనే పరీక్ష మొదలవుతుంది. ఒకవేళ పరీక్ష రాస్తు న్నప్పుడు కెమెరా ఫ్రేమ్‌లోకి మరోవ్యక్తి వచ్చినా కెమెరా ముందు నుంచి దరఖాస్తుదారుడు తప్పుకున్నా పరీక్ష ఆగిపోతుంది. అంతేకాక నిబంధనల ఉల్లంఘన కింద పరీక్ష రద్దవుతుంది.

సులువుగా లైసెన్స్‌..

- సందాని, జిల్లా రవాణా శాఖ అధికారి, జగిత్యాల

సారథి పోర్టల్‌లో భాగంగా ఇంటి నుంచే లెర్నింగ్‌ లైసెన్స్‌ పరీక్షకు హాజరయ్యే అవకాశం త్వరలోనే మొదలు కానుంది. ఫలితంగా వాహనదారులు రవాణాశాఖ కార్యాలయానికి రావల్సిన అవసరం ఉండదు. సాంకేతిక లోపాలు, ముఖ కదలికలు మ్యాచ్‌ కాకపోవడం ఇతర సమస్యలు వచ్చినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. నాన్‌-ఈకేవైసీ అప్లికేషన్లకు ఓటీపీ ద్వారా, ఈ కేవైసీ దరఖాస్తులకు బయోమెట్రిక్‌ (వేలిముద్ర) ద్వారా నేరుగా ఆర్టీవో ఆఫీస్‌లో పరీక్ష రాసే వెసులుబాటు కల్పించారు. ఇదికాక సారథి పోర్టల్‌లో వాహనదారులకు మరిన్ని సేవలు త్వరలో అందనున్నాయి.

Updated Date - Nov 14 , 2026 | 02:03 AM