‘ప్యూర్ ఎనర్జీ’కి అంతర్జాతీయ గుర్తింపు
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:02 AM
ఐఐటీ హైదరాబాద్ నుంచి ఆవిర్భవించిన స్టార్టప్ సంస్థ ‘ప్యూర్ ఎనర్జీ’, తాను రూపొందించిన ‘ప్యూర్ పవర్’ టెక్నాలజీతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.
‘భారత్ ఇన్నోవేట్స్-26’లో ప్రత్యేక ఆకర్షణగా ‘క్లీన్‌ఎనర్జీ’
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
కంది, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ హైదరాబాద్ నుంచి ఆవిర్భవించిన స్టార్టప్ సంస్థ ‘ప్యూర్ ఎనర్జీ’, తాను రూపొందించిన ‘ప్యూర్ పవర్’ టెక్నాలజీతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ సంవత్సరంలో భాగంగా ఫ్రాన్స్‌లో మంగళవారం ‘భారత్ ఇన్నోవేట్స్-2026’ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై ప్యూర్ ఎనర్జీ సంస్థ డీజిల్ జనరేటర్లకు ప్రత్యామ్నాయంగా, కాలుష్య రహితంగా, నిశ్శబ్దంగా పనిచేసే సరికొత్త ఇంధన నిల్వ (ఎనర్జీ స్టోరేజీ) వ్యవస్థను ప్రదర్శించింది. ఈ స్వదేశీ సుస్థిర సాంకేతికతపై అంతర్జాతీయ పరిశ్రమ ప్రముఖులు, పెట్టుబడిదారులు ఆసక్తి కనబరిచారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రదర్శనలో ప్యూర్ ఎనర్జీ స్టాల్‌ను సందర్శించారు. ప్యూర్ ఎనర్జీ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ డోంగారితో మాట్లాడి, ‘ప్యూర్ పవర్’ ఆల్-ఇన్-వన్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. సంప్రదాయ ఇన్వర్టర్లు, లెడ్-యాసిడ్ బ్యాటరీలకు అద్భుతమై ఆధునిక ప్రత్యామ్నాయమని ఆయన ప్రశంసించారు. అధునాతన టైమ్-ఆఫ్-డే (టీవోడీ), టైమ్-ఆఫ్-యూజ్ (టీఓయూ) ఎనర్జీ మేనేజ్‌మెంట్ సాంకేతికతతో పాటు హైబ్రిడ్ సోలార్ అనుసంధానం ఉన్న ఈ వ్యవస్థను యూరప్, ఆఫ్రికా మార్కెట్లకు విస్తరించాలని మంత్రి సూచించారు. స్వదేశీ సాంకేతికత, అధునాతన ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలతో ప్యూర్ ఎనర్జీ సంస్థ భారత స్వచ్ఛ ఇంధన భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తోందని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.