పులిచింతల రికార్డు!
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:55 AM
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తిలో రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి....
ఏడాదిలో 325 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
చింతలపాలెం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తిలో రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి 325 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. కేంద్రం ఎస్‌ఈ దేశ్‌నాయక్ మంగళవారం ఈ వివరాలు తెలిపారు. 120 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కేంద్రంలో మొత్తం నాలుగు యూనిట్లు ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వరదను ప్లాంట్ యంత్రాంగం సమర్థంగా వినియోగించుకుంది. లక్ష్యం 200 మిలియన్ యూనిట్లు కాగా, 325 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. 2018లో విద్యుదుత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇది రికార్డు కాగా, మొత్తం 182 టీఎంసీల నీటిని వినియోగించారు. హైడల్ డైరెక్టర్ బాలరాజు, చీఫ్ ఇంజనీర్ మంగే్‌షకుమార్ పర్యవేక్షణలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ యంత్రాలను నిర్వహించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఎస్‌ఈ తెలిపారు. కృష్ణాడెల్టాకు సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు విద్యుదుత్పత్తిలోనూ రికార్డులు సృష్టిస్తూ ఉభయ తెలుగు రాష్ర్టాలకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.