Chief Minister Praise for the Phule Couple: పూలే దంపతుల జీవితం..నేటి తరానికి స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:13 AM
సామాజిక సంస్కర్తలపై వచ్చే సినిమాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సామాజిక విప్లవకారులు....
కుల నిర్మూలనకు, మహిళా విద్యకు వారి పోరాటం అద్భుతం: సీఎం
మంత్రులతో కలిసి ‘పూలే’ సినిమాను చూసిన రేవంత్‌రెడ్డి
ఆర్టీసీ బస్సులో సినిమాకెళ్లిన నేతలు
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సామాజిక సంస్కర్తలపై వచ్చే సినిమాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను సీఎం తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సోమవారం వీక్షించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కుల నిర్మూలన కోసం పూలే దంపతులు చేసిన పోరాటం అద్భుతమని కొనియాడారు. మహిళా విద్యావ్యాప్తి కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రశంసించారు. సోమవారం శాసనసభ వాయిదాపడిన అనంతరం.. మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘‘ఏంటన్నా.. సినిమాకు వెళ్తున్నారా’’ అని ప్రశ్నించిన విలేకరులతో.. ‘‘అభినవ పూలే పొన్నం(మంత్రి పొన్నం ప్రభాకర్) పిలిస్తే వెళ్లకుండా ఉంటానా?’’ అంటూ సరదాగా బదులిచ్చారు.
అద్భుతమైన సందేశాన్నిచ్చే సినిమా: డిప్యూటీ సీఎం భట్టి
ఈ సినిమా సమాజానికి అద్భుతమైన సందేశాన్ని అందించే చిత్రమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మహిళల కోసం పూలే దంపతులు చూపిన శ్రద్ధ ఆదర్శనీయమైనదన్నారు. కులవివక్షలాంటి ఇబ్బందులను తట్టుకుని సమసమాజ స్థాపనకు కృషిచేశారన్నారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం, పూలే ఆశయాల సాధన కోసం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.