Share News

kumaram bheem asifabad-రోగులకు మెరుగైన సేవలు అందించాలి

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:00 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండల కేంద్రంలోని వివిధ కార్యాలయాలను మంగళవారం కలెక్టర్‌ తనిఖీ నిర్వహించారు.

kumaram bheem asifabad-రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ప్రాణహిత నదిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె.హరిత

కౌటాల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండల కేంద్రంలోని వివిధ కార్యాలయాలను మంగళవారం కలెక్టర్‌ తనిఖీ నిర్వహించారు. కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన సమయంలో అక్కడ డాక్టర్‌ లేక కేవలం సిబ్బంది మాత్రమే ఉన్నారు. డాక్టర్‌ పవన్‌ కళ్యాణ్‌ రిజైన్‌ చేయగా కేవలం సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. కలెక్టర్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు. పలువురు సిబ్బంది విధులకు హాజరు కాక పోవడంతో పాటు రిజిస్టర్‌లో హాజరు పట్టికలో ఖాళీగా ఉండడంతో ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు. డాక్టర్‌ లేక పోవడంతో అయూష్‌ డాక్టర్‌ వారంలో మూడు రోజులు వస్తున్నట్లు సిబ్బంది చెప్పారు. ఆయూష్‌ అటెండర్‌ విధులకు రాక పోవడంతో గైర్హాజరు వేశారు. అక్కడే డేటా ఎంట్రీ గది మూసి ఉండడంతో దాన్ని తెరిచి చూడగా సిస్టమ్‌, ప్రింటర్‌పై డస్ట్‌ పేరుకు పోయి ఉండడంతో ఇది చూస్తే మీ పని తీరు అర్థం అవుతోందని తమాషాలు చేయొద్దని మందలించారు. అనంతరం జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలను తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. గైర్హాజరు అయిన విద్యార్థులు ఎందుకు రాలేదని ఆరా తీశారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అనంతరం ప్రాణహిత నదిని పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించి మహారాష్ట్ర, తెలంగాణ నదుల కలయికతో ప్రాణహితగా ఏర్పడుతున్న విషయాన్ని ఎంపీడీవో ప్రసాద్‌ వివరించారు. నీటి లభ్యత, వానాకాలం వరద పరిస్థితి గురించి ఆరా తీశారు. ఎండకాలం నేపథ్యంలో నదిలో నీళ్లు ఉంటాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి ఎంత మంది గైర్హాజర అయ్యారని చీఫ్‌ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎండ తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో ప్రసాద్‌, తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌ ఉన్నారు.

ఉద్యానవనం సందర్శించి.. సిబ్బందికి సూచనలు చేసి..

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పిల్లల ఉద్యానవ నాన్ని మంగళవారం కలెక్టర్‌ హరిత సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పిల్లల ఉద్యానవనం లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యానవనాలని సందర్శించే వారికి ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను బహిరంగ ప్రదేశంలో పడేయకుండా చెత్తకుండీలో వేయాలని సూచించారు. ఉద్యానవనంలో మొక్కలు, గడ్డి ఎండి పోకుండా ప్రతి రోజు నీరందించా లని నిర్వహకులకు సూచించారు. ఉద్యానవనం పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్‌ పాలక వర్గం దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గజానంద్‌, కౌన్సిలర్లు వినోద్‌, స్వప్నరాణి, కృష్ణమ్మ, సిబ్బంది పాల్గొన్నార

Updated Date - Mar 10 , 2026 | 11:00 PM