kumaram bheem asifabad- ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:07 PM
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లాలోని తిర్యాణి మండలం చింతపల్లి గ్రామంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిలువలు, పారిశుధ్యం నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
తిర్యాణి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లాలోని తిర్యాణి మండలం చింతపల్లి గ్రామంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిలువలు, పారిశుధ్యం నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయ పాలన పాటించాలని, ఆలస్యంగా వచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అవసరమైన ఔషధ నిలువలు అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి తరగతి గదులు, విద్యాబోధన తీరు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి అబ్యాసన సామర్థ్యాలను పరిశీలించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవో అంజయ్యను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా అదనపు తరగతి గదులు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఆమె వెంట ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.