Share News

ప్రత్యామ్నాయ పంటలెక్కడ?

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:23 AM

ధాన్యం అసాధారణ స్థాయిలో ఉత్పత్తి అవుతుండటం, దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారుతుండటం సంతోషం కలిగిస్తున్నా వరిసాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతుండటం ఆలోచింపజేస్తోంది.

ప్రత్యామ్నాయ పంటలెక్కడ?

  • ఏడాదికి రెండు పంటలూ వరేనా?

  • దేశంలో గణనీయంగా తగ్గుతున్న ఇతర ఆహార పంటలు

  • పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలకు దిగుమతే గతి

  • ప్రత్యామ్నాయ పంటలకు బోనస్‌ ఇస్తే మేలు..

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ధాన్యం అసాధారణ స్థాయిలో ఉత్పత్తి అవుతుండటం, దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారుతుండటం సంతోషం కలిగిస్తున్నా వరిసాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతుండటం ఆలోచింపజేస్తోంది. ఖరీఫ్‌, యాసంగి సీజన్లలోనూ అదే పంటను సాగు చేస్తుండటంతో ఇతర పంటల సాగును వరి మింగేస్తోందన్న ఆందోళన కలిగిస్తోంది. పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగును ఏటికేడు తగ్గుతుండటంతో డిమాండ్‌కనుగుణంగా ఆ పంటల ఉత్పత్తి ఉండటంలేదు. వడ్లు అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంటే.. ఇతర ఆహార పంటలను దిగుమతి చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో వరి సాగును తగ్గించి ఇతర పంటల సాగువిస్తీర్ణం పెంచాలంటే.. చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పుధాన్యాల సాగుకు ప్రభుత్వం ‘బోనస్‌’ ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్నాలకు రూ.500 బోనస్‌ ఇస్తుండటంతో వరి సాగు మరింత పెరిగింది. ఇదే తరహాలో ప్రత్యామ్నాయ పంటలకు బోనస్‌ ప్రకటిస్తే... దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించే అవకాశాలున్నాయి. గత వానాకాలంలో 67,30,408 ఎకరాలు, నిరుడు యాసంగిలో 59,92,177 ఎకరాల విస్తీర్ణంలో రైతుల వరి సాగుచేశారు. ఈ యాసంగిలో ఇప్పటికే 57,32,497 ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇది 60 లక్షల ఎకరాలకుచేరే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాల వరి సాగుచేసిన రైతులకు ఎమ్మెస్పీపై క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్‌ ఇస్తోంది. దీంతో క్వింటాకు రూ.2,869 నుంచి రూ. 2,889 చొప్పున గిట్టుబాటవుతోంది. ఫలితంగా గతానికి ఇప్పటికి సన్నాల సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రంలో ఏడాదిలో 1.28 కోట్ల ఎకరాల్లో వరి సాగుచేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఇదికాకుండా రాష్ట్రంలో 45- 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.


హరియాణాలో ఎకరాకు 7,500

వరికి బదులు ఇతరపంటల వైపు రైతులను మళ్లించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం ప్రకటించాల్సి ఉంటుంది. హరియాణా ప్రభుత్వం వరి సాగు నుంచి బయటకొచ్చి, ఇతర పంటలు వేసే రైతులకు ఎకరానికి రూ. 7,500 చొప్పున ప్రోత్సాహం ఇస్తోంది. దీంతో రైతులు ఇతర పంటల సాగు వైపు మళ్లుతున్నారు. కర్ణాటకలో రాగులు సాగుచేసే రైతులకు ఎమ్మెస్పీపై క్వింటాకు రూ.500చొప్పున బోనస్‌ ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఆలుగడ్డకు రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించి ఫామ్‌గేట్‌లో కొంటోంది. పంజాబ్‌లో వానాకాలంలో వరి, యాసంగిలో గోధుమ పంటను సాగుచేస్తున్నారు. కాగా ఒడిసా ప్రభుత్వం పంట వైవిధ్యీకరణ కార్యక్రమం కోసం 2026-27బడ్జెట్‌లో రూ.469 కోట్లు కేటాయించింది. మిల్లెట్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి చిరుధాన్యాలు కొని మధ్యాహ్నభోజనం, ఐసీడీఎస్‌ పథకాలకు సరఫరా చేస్తున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు. తమిళనాడు, ఏపీలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలన్నింటికీ ఎమ్మెస్పీ నిర్ణయుంచి, బోనస్‌ ప్రకటిస్తే రైతులు సాగుకు మొగ్గుచూపే అవకాశాలున్నాయి.

ఇతర ఆహార ధాన్యాలు 80శాతం దిగుమతే

రాష్ట్రంలో ప్రజావసరాలకు సరిపడా చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయల్లో 20 శాతమే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో 80శాతం పంటలను ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 50,530 ఎకరాలు కాగా... నిరుడు ఖరీఫ్‌‌లో 36,239 ఎకరాల్లోనే రైతులు సాగుచేశారు. సజ్జలు152 ఎకరాల్లో, రాగులు 389 ఎకరాల్లో, కొర్రలు, సామల లాంటి చిరుధాన్యాలు 63 ఎకరాల్లో సాగుచేశారు. కంది విస్తీర్ణం 26 శాతం, పెసర విస్తీర్ణం 28శాతం, మినుముల సాగు 13శాతం తగ్గింది. యాసంగిలో శనగల సాగు 33ు తగ్గింది. వేరుశనగతో కలిపి నూనె గింజల విస్తీర్ణం 3.16 లక్షల ఎకరాలు, పప్పుధాన్యాల సాగువిస్తీర్ణం 3.11 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. పప్పుదినుసులు, చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు పండిస్తే అందరికీ మేలు జరిగే అవకాశాలున్నాయి.


దేశంలో సాగుభూమిలో 38 శాతం వరే

దేశంలో మొత్తం సాగుభూమిలో 38శాతం విస్తీర్ణంలో వరి, గోధుమలే సాగుచేస్తున్నారు. 1960-61లో ఈ రెండు పంటల విస్తీర్ణం 36 మిలియన్‌ హెక్టార్లుండగా... 2024-25 నాటికి 85 మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది. దేశంలో వాడే యూరియాలో 56శాతం యూరియాను వరి, గోధుమ పంటలకే వాడుతున్నారు. 2010లో ఎరువుల సబ్సిడీ రూ.63,221 కోట్లుంటే... ఇప్పుడు రూ.2 లక్షల కోట్లు దాటింది. వరి, గోధుమలపై ఆధారపడటంతో నీటి వనరులు తగ్గుతున్నాయి. విద్యుత్‌ వినియోగం, ప్రభుత్వ సబ్సిడీల భారం పెరుగుతోంది. దేశంలో యేటా సుమారు రూ.90 వేల కోట్ల విలువైన సబ్సిడీ విద్యుత్‌ వ్యవసాయానికి సరఫరా చేస్తున్నారు. వరికి ఎమ్మెస్పీ కంటే ఎక్కువ బోనస్‌ ఇవ్వటంతో మార్కెట్‌ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉందని, వ్యవసాయ ఖర్చులు, ధరల నిర్ణయక కమిషన్‌ (సీఏసీపీ) అధ్యయనం చెబుతోంది. కేరళ ప్రభుత్వం క్వింటా వరికి రూ.800 బోనస్‌ ఇస్తోంది. ఒడిసా ప్రభుత్వం 2024 నుంచి క్వింటాలు వరికి రూ.3,100 చొప్పున ధర చెల్లిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో క్వింటాకు రూ.3,100 చొప్పున చెల్లిస్తున్నారు. తెలంగాణలో పీడీఎస్‌కు ఏడాదికి 24 లక్షల టన్నుల బియ్యం సరిపోతాయి. ప్రైవేటు మార్కెట్‌ మరో 26 లక్షల టన్నులు ఉంటుంది. కానీ ధాన్యం ఉత్పత్తి ఏడాదికి 3.20 కోట్ల టన్నులు అవుతోంది.

4.jpg

సాగు ప్రణాళికను రూపొందించాలి

రాష్ట్ర వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలి. రాష్ట్ర అవసరాలమేరకు పంటలు వేయటంతోపాటు వాతావరణానికి అనుకూలంగా పంటల విధానం మార్చాలి. వానాకాలం వరి వేసిన ప్రాంతాల్లో లోతట్టు భూములు మినహా మిగిలిన భూములు, బావులు, బోర్ల కింద మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, పప్పుధాన్యాలు, జనుము, కూరగాయల లాంటి మెట్ట పంటలు వేయాలి. పంటల మార్పిడికి ప్రాధాన్యమివ్వాలి. ఉద్యాన పంటల విస్తీర్ణం 12 లక్షల ఎకరాల నుంచి 25 లక్షల ఎకరాలకు పెంచాలి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దిగుమతులు తగ్గించాలి.

-సారంపల్లి మల్లారెడ్డి, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు


2.jpg

పంటలన్ని ప్రభుత్వమే కొనాలి

పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాలు, పసుపు పంటల కొనగోళ్లు ప్రభుత్వమే చేపట్టాలి. కేంద్రం ఇవ్వకపోయినాసరే... రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇవ్వాలి. కేంద్రం అన్ని పంటలకు ఎమ్మెస్పీ ప్రకటించాలి. రైతులకు భరోసా కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించాలి. పూర్తిగా కాకపోయినా పంట ఉత్పత్తిలో కనీసం 25 శాతం సేకరించినా రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మార్కెట్‌ భద్రత ఏర్పడుతుంది.

- దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణుడు

3.jpg

దిగుమతులపై ఆధారపడొద్దు

బియ్యం, గోధుమలు మినహా ఇతర ఆహార ధాన్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. పప్పులు, నూనెలు, మిల్లెట్స్‌, కూరగాయలు స్థానికంగా 20 శాతమే ఉత్పత్తి అవుతున్నాయి. 80 శాతం ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలసాగు పెంచాలంటే ప్రభుత్వం బోనస్‌ ఇచ్చి రైతులను ప్రోత్సహించాలి.

- కన్నెగంటి రవి, రైతుస్వరాజ్య వేదిక

Updated Date - Mar 10 , 2026 | 04:23 AM