ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులివ్వలేదు
ABN , Publish Date - May 27 , 2026 | 04:39 AM
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ...
జనసేనపై వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా.. నాపై ట్రోలింగ్
చర్యలు తీసుకోండి: డీజీపీకి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫిర్యాదు
హైదరాబాద్, కార్వాన్, మే 26 (ఆంధ్రజ్యోతి): తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నానని, దీనిని జనసేన పార్టీ స్వాగతించిందని, తనకు ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన డీజీపీకి తెలిపారు. తనకు ఏ పోలీసు అధికారి ఫోన్ చేయలేదని, సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన వ్యాఖ్యలతో ట్రోలింగ్ జరుగుతోందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, టోలిచౌకిలోనీ సత్వా మాగ్నాస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నాగేశ్వర్ ఇంటి వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు నాగేశ్వర్‌కు నోటీసులు ఇస్తారని, అరెస్ట్ చేస్తారంటూ టీవీ చానెల్స్‌లో వార్తలు రావడంతో మంగళవారం ఆయనకు మద్దతుగా కొంతమంది కమ్యూనిస్టు నాయకులు ఆయన ఇంటికి వెళ్లారు.