Professor Jayashankar Agricultural University: వ్యవసాయ వర్సిటీలో పేపర్ లీక్‌లు
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:13 AM
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సు మూడో సంవత్సరం ప్రశ్నపత్రం లీక్ అయ్యింది.
జగిత్యాల కళాశాలలో ఇన్ సర్వీస్ అభ్యర్థి కాపీ కొడుతూ దొరకడంతో లీక్ బాగోతం వెలుగులోకి..
వాట్సాప్‌లో ఇతర కళాశాలల ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు
సిబ్బంది చేతివాటం.. చేతులు మారిన డబ్బు
ఓ ఉన్నతాధికారి సహా నలుగురి సస్పెన్షన్
35 మంది అభ్యర్థుల ప్రవేశాల రద్దు
రాజేంద్రనగర్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సు మూడో సంవత్సరం ప్రశ్నపత్రం లీక్ అయ్యింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. నవంబరు 21న వర్సిటీ పరిధిలోని జగిత్యాల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ తృతీయ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష రాస్తున్న ఓ ఇన్ సర్వీస్ (ఏఈఓగా పనిచేస్తూ చదువుతున్న) అభ్యర్థి కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు. దాంతో ఆ ఏఈఓ తనకు పేపరు లీకైందని చెప్పగా.. కళాశాల అసోసియేట్ డీన్ యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, రిజిస్ట్రార్ జీఈసీహెచ్ విద్యాసాగర్ విచారణ కమిటీ వేశారు. విచారణ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ భారతీ నారాయణ భట్‌ను సెలవులో పంపించారు. జగిత్యాలతో పాటు అశ్వారావుపేట, వరంగల్ వ్యవసాయ కళాశాలల్లో పరీక్షలు రాసిన ఇన్ సర్వీస్ అభ్యర్థులను విచారణ కమిటీ ప్రశ్నించి.. పేపర్ లీకేజీపై వివరాలు రాబట్టింది. దీంతో వర్సిటీ పరిధిలోని వేర్వేరు కాలేజీల్లో బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసినట్లు వర్శిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వారిని తిరిగి వ్యవసాయ శాఖకు అప్పగించామన్నారు. ఇటీవల తాను ఇతర అధికారులతో కలసి జగిత్యాల కళాశాలను సదర్శించిన సందర్భంగా సీసీటీవీ పుటేజీల ఆధారంగా ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లు అనుమానించామని తెలిపారు. ముగ్గురు అధికారుల కమిటీ విచారణ జరిపి ఇన్ సర్వీస్ కోటాలో బీఎస్సీ అగ్రికల్చర్ మూడో ఏడాది చదువుతున్న 35మంది అభ్యర్థులు ఒక పథకం ప్రకారం సెమిస్టర్ పైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారంతో లీక్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు పంపుతున్నారని, ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని తెలిపారు. పథకం ప్రకారం కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు. 2014 నుంచి 2024 వరకు వర్సిటీలో పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు లేకపోవడంతో ఎన్నో అవకతవకలు జరిగాయని, పేపర్ లీకేజీ కుంభకోణం ఒకటని పేర్కొన్నారు. దీనిపై సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.