Share News

కర్రెగుట్టల నుంచి సాయుధ బలగాలను వెనక్కు రప్పించాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:53 AM

కర్రెగుట్టల అడవుల్లో కొనసాగుతున్న ఆపరేషన్‌ కగార్‌ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, అక్కడ మొహరించిన సాయుధ బలగాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని....

కర్రెగుట్టల నుంచి సాయుధ బలగాలను వెనక్కు రప్పించాలి

  • బస్తర్‌ను యుద్ధభూమిగా మార్చేశారు: ప్రొ. హరగోపాల్‌

నల్లకుంట, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కర్రెగుట్టల అడవుల్లో కొనసాగుతున్న ఆపరేషన్‌ కగార్‌ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, అక్కడ మొహరించిన సాయుధ బలగాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. 700 క్యాంపులు, 8.50 లక్షల సాయుధ బలగాలతో బస్తర్‌ ప్రాంతాన్ని యుద్ధభూమిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువల్ని కాలారాస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. గురువారం ఆయన పౌరహక్కుల సంఘం నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. విప్లవోద్యమాన్ని అణచివేసే నెపంతో ఓ వైపు లొంగుబాట్లు, మరోవైపు హత్యాకాండలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. గతేడాది ప్రారంభమైన ఆపరేషన్‌ కగార్‌లో ఇప్పటివరకు 90 ఎన్‌కౌంటర్లు జరిగాయని వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఆయ పేర్కొన్నారు. కేంద్రంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్‌.. తెలంగాణలో అధికారంలో ఉండి కూడా కేంద్రం చేపట్టిన ఈ హత్యాకాండకు మద్దతు తెలపడం విచారకరమని హరగోపాల్‌ అన్నారు. 10 నెలలుగా ఐదుసార్లు చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా.. ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ప్రస్తుతం మరోసారి కర్రెగుట్టల వద్ద వేలాది బలగాలతో చుట్టుముట్టి మరో మారణకాండకు సిద్ధమవ్వడం అప్రజాస్వామికమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌ రెడ్డి, మంత్రి సీతక్కలు ఈ విషయంలో చొరవ తీసుకుని హింసను ఆపాలని కోరారు.

Updated Date - Feb 20 , 2026 | 12:53 AM