మీ పాలన భేష్..!
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:12 AM
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాపాలన అద్భుతమంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ కొనియాడారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు అద్భుతం
సీఎం రేవంత్‌పై ప్రియాంకా గాంధీ ప్రశంసలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాపాలన అద్భుతమంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ కొనియాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు బాగుందని కితాబిచ్చారు. మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి మూడో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రియాంకతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మునిసిపల్ ఎన్నికలు, పొత్తుల గురించి ప్రియాంక ఆరా తీశారు. ఎన్ని మునిసిపాలిటీలున్నాయి? ఎన్నిచోట్ల విజయం సాధించాం.. ఎన్ని చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్నాం? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా.. బీజేపీ పరిస్థితి ఏమిటి.. బీఆర్‌ఎ్‌సకు ఎన్ని సీట్లు వచ్చాయి? అనే అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, దానికి మునిసిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రేవంత్ వివరించారు. అత్యధిక స్థానాల్లో పార్టీ విజయం సాధించడంపై రేవంత్‌ను ప్రియాంక అభినందించారు.