జీతాలు పెంచితేనే వస్తాం!
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:36 AM
గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఇంటర్నేషనల్, కార్పొరేట్, టెక్నో విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు వేతనాల పెంపుపై చేస్తున్న డిమాండ్‌తో యాజమాన్యాలు సతమతమవుతున్నాయి.
కనీసం రూ.50 వేలు ఇవ్వాలని ఏపీ, కేరళకు చెందిన ప్రైవేట్ టీచర్ల డిమాండ్
సతమతమవుతున్న జీహెచ్‌ఎంసీలోని కార్పొరేట్, టెక్నో స్కూళ్ల యజమానులు
హైదరాబాద్ సిటీ, జూన్ 2(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఇంటర్నేషనల్, కార్పొరేట్, టెక్నో విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు వేతనాల పెంపుపై చేస్తున్న డిమాండ్‌తో యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. వేసవి సెలవులకు సొంతూళ్లకు వెళ్లొచ్చిన ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు తమకు నెలకు కనీసం రూ.50 వేలకు పైగా జీతంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పించాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. తమ డిమాండ్లకు ఒప్పుకుని ముందుగా మూడు నెలల వేతనాలు బ్యాంకు ఖాతాల్లో వేస్తేనే ఈ నెల 12న ప్రారంభమయ్యే పాఠశాలలకు వస్తామని, లేకుంటే వచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు. ఆయా విద్యా సంస్థల్లో కొన్నేళ్లుగా ఏపీ, కేరళకు చెందిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారు గణితం, ఇంగ్లిష్, సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధిస్తున్నారు. వారి విద్యార్హతలు, బోధన తీరును బట్టి యాజమాన్యాలు వేతనాలు ఇస్తున్నాయి. గత ఏడాది రూ.35-40వేల వేతనంతో పనిచేసిన టీచర్లు ఈసారి రూ.50వేలపైగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 4,667 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 48 శాతం ఇంటర్నేషనల్, కార్పొరేట్, టెక్నో స్కూళ్లు కాగా మిగతా 52శాతం బడ్జెట్ పాఠశాలలుగా నడుస్తున్నాయి. 2025-26 గణాంకాల ప్రకారం ఆయా విద్యా సంస్థల్లో 19లక్షలమంది విద్యార్థులు చదివారు. 2024-25తో పోలిస్తే పలు ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లలో 20-22 శాతం నూతన అడ్మిషన్లు జరిగాయి. ఇప్పటివరకు తమ పాఠశాలల్లో నాణ్యమైన బోధన చేస్తూ వచ్చిన టీచర్ల తాజా డిమాండ్‌తో యాజమాన్యాలు పరేషాన్ అవుతున్నాయి. ఈసారి కూడా 10శాతం వేతనాలు పెంచుతామని హామీ ఇస్తున్నా కొందరు టీచర్లు ససేమిరా అంటున్నారని తెలిసింది. ప్రధానంగా 7 నుంచి 10వ తరగతి వరకు బోధించే టీచర్లు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది యజమానులు వారు అడిగినంతా ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు కొత్తవారిని నియమించుకోవాలని ఆలోచిస్తున్నారు. టీచర్ల డిమాండ్‌కు ఒప్పుకుంటున్న కొన్ని యాజమాన్యాలు.. ఆ భారాన్ని ఫీజుల పేరిట విద్యార్థులపై మోపేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు దృష్టి సారించకపోతే తమపై అదనపు భారం పడే పరిస్థితి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.