వెనుక నుంచి దూసుకొచ్చిన మృత్యువు
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:12 AM
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు రూపంలో వెనుక నుంచి...
కారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తల్లి, కూతురు, కుమారుడు సహా నలుగురి మృతి
భర్తకు తీవ్ర గాయాలు
బస్సులోని ప్రయాణికులు సురక్షితం
చిట్యాలరూరల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు రూపంలో వెనుక నుంచి దూసుకొచ్చిన మృత్యువు ఓ కారులో ప్రయాణిస్తున్న నలుగురి ప్రాణాలను కబళించింది. ప్రైవేటు బస్సు వెనుక నుంచి కారును ఢీకొట్టిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన మలిరెడ్డి విజయలక్ష్మి (40), ఆమె కుమార్తె శ్రియ (17), కుమారుడు ప్రభవ్ (12)తోపాటు సినీ పరిశ్రమలో ఎడిటర్‌గా పని చేస్తున్న కట్టా శ్రీకర్ ప్రసాద్(62) అనే మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మలిరెడ్డి విజయలక్ష్మి భర్త, బ్యాంక్ మేనేజర్ మలిరెడ్డి వీర వెంకట నాగవరప్రసాద్‌బాబు(45) తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇందుకు సంబంధించి నార్కట్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని కాకినాడకు చెందిన మలిరెడ్డి వీర వెంకట నాగవరప్రసాద్‌బాబు వికారాబాద్ ఎస్‌బీఐ శాఖలో మేనేజర్‌గా పని చేస్తుంటారు. ప్రసాద్ బాబు తన భార్య విజయలక్ష్మి, కుమార్తె శ్రియ, కుమారుడు ప్రభవ్‌తో కలిసి హైదరాబాద్, యూసూ్‌ఫగూడలోని మధురానగర్‌లో నివాసముంటున్నారు. ఈ కుటుంబానికి సన్నిహితుడు, హైదరాబాద్‌లోని గుండ్లపోచంపల్లిలో నివసిస్తున్న కట్టా శ్రీకర్‌ప్రసాద్ సినీ పరిశ్రమలో ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్, ప్రసాద్ బాబు కుటుంబం కలిసి వ్యక్తిగత పని మీద కారులో చెన్నై వెళ్లారు. పని ముగించుకుని శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటలప్పుడు పెద్దకాపర్తి శివారులో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అర్షియా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వీరి కారును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఈ క్రమంలో కారులో ఉన్న విజయలక్ష్మి, శ్రియ, ప్రభవ్, శ్రీకర్ ప్రసాద్ అక్కడికక్కడే మరణించారు. కారు నడుపుతున్న వరప్రసాద్‌బాబు తీవ్రంగా గాయపడ్డారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు దాదాపు గంట సేపు తీవ్రంగా శ్రమించారు. గాయపడిన ప్రసాద్ బాబును ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షితంగా ఉన్నారు.