ప్రిన్సిపల్‌కు పీడకలలు వస్తున్నాయనే..
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:00 AM
పిల్లలు చదువుకునే గురుకులంలో క్షుద్రపూజలు జరిపించడం ఏమిటి? పసుపు, కుంకుమ కలిపిన నీళ్లను అక్కడ చదువుతున్న బాలికలపై చల్లడమేమిటి? ఇలా జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గిరిజన....
గురుకులంలో క్షుద్రపూజలు జరిపించారు
గూడూరు ఘటనపై తహసీల్దార్ వెల్లడి
పిల్లలు బాగా చదవాలనే పూజలు చేశాం
అవి క్షుద్రపూజలని ప్రచారం చేశారు: ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ గదిలోనే పూజలు.. క్షుద్రపూజలు కావు: విచారణాధికారి
పాలకుర్తి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): పిల్లలు చదువుకునే గురుకులంలో క్షుద్రపూజలు జరిపించడం ఏమిటి? పసుపు, కుంకుమ కలిపిన నీళ్లను అక్కడ చదువుతున్న బాలికలపై చల్లడమేమిటి? ఇలా జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గిరిజన గురుకుల పాఠశాలలో 22న రాత్రి క్షుద్రపూజలు జరిపించిన ఘటనపై తల్లిదండ్రులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై తహసీల్దార్ సరస్వతి స్పందించారు. గిరిజన గురుకులంలో క్షుద్ర పూజలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆమె చెప్పారు. ప్రిన్సిపల్ రేణుకకు పీడకలలు వస్తున్నాయనే కారణంతో ఈ పూజలు చేయించినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు, ఇదే విషయాన్ని తాము కలెక్టర్‌కు నివేదించామని తెలిపారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ రేణుకను వివరణ కోరగా.. విద్యార్థినులు బాగా చదవాలని గుమ్మడికాయ కొట్టి పూజలు చేశామని చెప్పారు. అయితే ఈ పూజలను క్షుద్ర పూజలు అని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గూడూరు గిరిజన బాలికల గురుకులంలో చోటుచేసుకున్న ఘటనపై మంగళవారం గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ డీఎస్ వెంకన్న విచారణ చేపట్టారు. పాఠశాలలో సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రిన్సిపల్ తన చాంబర్‌లోనే పూజలు చేశారని, అవి క్షుద్ర పూజలు అని ప్రచారం జరిగిందన్నారు. పూజల ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన వేర్వేరుగా మాట్లాడారు. విద్యార్థులతో సమావేశమై వారి ఆందోళనకు గల కారణాలపై ఆరా తీశారు. భోజనం, ఇతర సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. అన్నం ముద్దగా అవుతోందని, కూరలు రుచిగా ఉండడం లేదని పిల్లలు ఆయనతో చెప్పారు. ఆయా సబ్జెక్టులకు అధ్యాపకుల కొరత ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు ఎలా రాయాలని వాపోయారు. భోజనం రుచిగా, శుచిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమున్న సబ్జెక్టులకు తాత్కాలికంగా అధ్యాపకులను సర్దుబాటు చేయాలని ప్రిన్సిపల్ రేణుకను వెంకన్న ఆదేశించారు.