కొండగట్టులో అర్చకుల ధర్నా
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:59 AM
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అర్చకులు ఆలయ రాజగోపురం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు.
నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ కార్యకర్తల పూజలు
వారు లోపలికి ఎందుకొచ్చారంటూ అర్చకులపై ఈవో దుర్భాషలు
అర్చకుల మనస్తాపం.. విధుల బహిష్కరణ
మల్యాల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అర్చకులు ఆలయ రాజగోపురం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. తమ పట్ల ఆలయ ఈవో శ్రీకాంత రావు ప్రదర్శించిన వైఖరిపై తీవ్ర ఆవేదన చెంది, విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఏపీ, తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపించేందుకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికొచ్చారు. ఈ విషయమ్మీద అంతకుముందే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, దేవస్థానం అధికారులకు సమాచారమిచ్చారు. ఓ ఇరవై మంది వరకు కార్యకర్తలు, నాయకులు అంజన్న సన్నిధిలో లోకేశ్ పేరిట పూజలు జరుపుతుండగా అక్కడికి ఈవో శ్రీకాంత రావు ప్రవేశించారు. వచ్చీరావడంతోనే వీరంతా ఎందుకు లోపలికొచ్చారు? అంటూ అర్చకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న అధికారులు సమాధానమిస్తుండగానే కార్యకర్తలను అక్కడి నుంచి బయటకు తోసేశారు. అనంతరం రాజకీయం చేస్తున్నారా? దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారంటూ అర్చకులను ఉద్దేశించి దుర్భాషలాడారు. దీనిపై అర్చకులు మూకుమ్మడిగా ఈవో తీరును తప్పుపట్టారు. అప్పటికీ ఈవో ఆగ్రహంతో ఊగిపోతూ సస్పెండ్ చేస్తా అంటూ అర్చకులను హెచ్చరించారు. దీంతో తమను అవమానించారంటూ అర్చకులు ఆలయం ఎదుట ధర్నా చేశారు. వారికి ఆలయ ఉద్యోగులు, సిబ్బంది కూడా మద్దతు పలికారు. సుమారు అరగంట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అర్చకులు.. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి ఫోన్ ద్వారా విషయాన్ని వివరించారు. ఆందోళన చెందొద్దని, తాను తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇవ్వడంతో అర్చకులు ఆందోళన విరమించారు. ఈ విషయమై ఈవో శ్రీకాంత్‌రావును వివరణ కోరగా అర్చకుల ఆరోపణల్లో వాస్తవం లేదని, పేర్కొన్నారు. ఆలయంలో భక్తుల వద్ద డబ్బులు తీసుకుని హుండీలో వేయకపోవడంపై నోటీసులు ఇవ్వడంతోనే ఆందోళన చేశారని తెలిపారు.