Share News

బంగారం కోసం భక్తురాలి ప్రాణాలు తీసిన పూజారికి యావజ్జీవ కారాగారం

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:54 AM

భక్తురాలితో నమ్మకంగా మెలుగుతూ చివరికి ఆమెను హత్య చేసిన పూజారికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది.

బంగారం కోసం భక్తురాలి ప్రాణాలు తీసిన పూజారికి యావజ్జీవ కారాగారం

  • మల్కాజిగిరి అదనపు జిల్లా కోర్టు తీర్పు

మల్కాజిగిరి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): భక్తురాలితో నమ్మకంగా మెలుగుతూ చివరికి ఆమెను హత్య చేసిన పూజారికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. ఆమె ఒంటి మీదన్న బంగారంపై కన్నేసి దేవాలయం ఆవరణలోనే ఈ దారుణానికి పాల్పడడం అప్పట్లో సంచలనం కలిగించింది. మల్కాజిగిరి విష్ణుపురిలోని స్వయంభూ సిద్ధి వినాయక ఆలయం పూజారి అనుముల మురళీకృష్ణకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సోమవారం న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. విష్ణుపురికి చెందిన ఉమాదేవి(56) నిత్యం ఆ దేవాలయానికి వెళ్లి పూజలు చేయించుకునేది. పూజారి మురళీకృష్ణ 2022 ఏప్రిల్‌ 18న ఎప్పటిలాగానే ఆమె గుడికి ఒంటరిగా వెళ్లగా ఆ సమయంలో అక్కడ ఇంకెవరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్నాడు. ఓ ఇనుపరాడ్‌తో తలపై మోది హత్యచేసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. వారం రోజుల్లోపే కేసును ఛేదించి నిందితుడ్ని అరెస్టు చేశారు. వాదనలు విన్న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అదనపు జడ్జి డి. కిరణ్‌కుమార్‌ నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు, రూ.7వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Updated Date - Feb 17 , 2026 | 06:54 AM