kumaram bheem asifabad- జనగణనకు సన్నద్ధం
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:18 PM
జనగణనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2021లో జనగణన చేపట్టాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది మే మాసంలో జనగణన ప్రారంభం కానుంది. మే మాసంలో ఇళ్లకు సంబందించిన సమాచారం సేకరిస్తారు. 2
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జనగణనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2021లో జనగణన చేపట్టాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది మే మాసంలో జనగణన ప్రారంభం కానుంది. మే మాసంలో ఇళ్లకు సంబందించిన సమాచారం సేకరిస్తారు. 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలను సేకరిస్తారు.
- మొదట బ్లాక్‌ల గుర్తింపు..
జిల్లా, మండల, డివిజన్ స్థాయిలో జనగణన కోసం చార్జ్ ఆఫీసర్లుగా నియమితులైన తహసీల్దార్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. ఉన్నతాధికారులకు అందిన జాబితాకు అనుగుణ ంగా 800 లోపు జనాభాను ఒక బ్లాక్‌గా గుర్తించే ప్రక్రియను చేపడుతున్నారు. గ్రామం, హబిటేషన్, రెవెన్యూ గ్రామాల వారీగా జనాభా ఎక్కువగా ఉంటే రెండు, తక్కువగా ఉంటే ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. ఒక దాన్ని మరో దాంట్లో కలిపేందుకు అవకాశం లేదు. కాగా జిల్లా వ్యాప్తంగా మొదట బ్లాక్‌ల ప్రక్రియ పూర్తి చేసి ఒక్కో బ్లాక్‌కు ఎన్యుమరేటర్‌ను, అరు బ్లాక్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమిస్తారు. దాంతో పాటు పది శాతం అదనంగా ఎన్యుమరేటర్లను ఉంచుతారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 5,15,812 జనాభా ఉండగా అది ఇప్పుడు పెరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో జనాభా పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
- ఇళ్లకు జియో ట్యాగింగ్..
జనగణనలో మొదట హౌస్‌హోల్డ్ ప్రక్రియను చేపడతారు. మొదట మూడు రోజులు ఆయా ఇళ్లకు వెళ్లి జియో ట్యాగింగ్ చేస్తారు. నాలుగవరోజు నుంచి ప్రతి నిర్మాణంలో ఉన్న ఇళ్లు, పాఠశాల, ఇతర అన్ని రకాల నిర్మాణాల వద్దకు వెళ్లి అది ఇల్లా, పాఠశాల లేకపోతే ఇతర పరిశ్రమనా అనేది రికార్డు చేస్తారు. ఇల్లు అయితే గోడలు దేనితో కట్టారు. ఫ్లోరింగ్, రూఫ్ ఎలా ఉంది, ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నారు. ఇంటి పెద్దపేరు, పెళ్లికానీ వారెవరైనా ఉన్నారా? అనే విషయాలను రికార్డు చేస్తారు. కాగా ఈసారి పేపర్‌లెస్ జనగణన చేపట్టడంతో పాటు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం కల్పించారు. ఎన్యుమరేటర్లు ఇళ్ల ప్రక్రియం నమోదు చేయడంతో పాటు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆస్తులు, ఆర్థిక పరిస్థితి నమోదు చేస్తే అది ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోతుంది. ఎవరైనా సెల్‌ఫోన్‌లో జనగణన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఇచ్చిన 34 ప్రశ్నలకు సెల్ఫ్‌గానే సమాధానాలు ఇవ్వొచ్చు. అలా ఇచ్చుకున్న వారికి ఒక ఐడీ వస్తుంది. జనగణన సందర్బంగా ఎన్యుమరేటరు వారి ఇంటికి వచ్చినప్పుడు వారు ఐ డీ నంబర్ చెబితే అవన్నీ సరిగా ఉన్నాయా అని తెలుసుకొని ఎన్యుమరేటర్ అప్‌లోడ్ చేస్తారు.
- సమాచారం గోప్యం..
జనగణన సమాచారమంతా గోప్యంగా ఉంచుతారు. సమాచార హక్కు చట్టం కింద ఎవరు దరఖాస్తు పెట్టినా ఈ సమాచారం ఇవ్వరు. ఈ సమాచారం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బడ్జెట్ అదికంగా కేటాయిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు తదితర ప్రభుత్వ పథకాలకు ఈ లెక్కలను లింకు పెట్టారని అధికారులు చెబుతున్నారు.
2011 లెక్కల ప్రకారం జిల్లా వివరాలు ఇలా..
భౌగోళిక విస్తీర్ణం : 4294.64 స్క్వేర్ కిలోమీటర్
రెవెన్యూ గ్రామాలు : 434
మండలాలు : 15
మున్సిపాలిటీలు : 02
పంచాయతీలు : 335
జనాభా(2011 లెక్కల ప్రకారం) : 5,15,812
పురుషులు : 2,58,197
మహిళలు : 2,57,615
కుటుంబాలు : 1,20,420