kumaram bheem asifabad-పుర పోరుకు సన్నద్ధం
ABN , Publish Date - Jan 04 , 2026 | 10:44 PM
మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ మున్సిపాలిటీలకు ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలను జారీ చేసింది
- జిల్లాలో రెండు మున్సిపాలిటీలు
కాగజ్‌నగర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ మున్సిపాలిటీలకు ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో అధికారులు ఎన్నికల జాబితా సిద్ధం చేసేందుకు మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇపాటికే రెవెన్యూ అధికారుల నుంచి ఎన్నికల జాబితా తీసుకొని ఆయా వార్డుల పరిధిలో ఉండే జనాభా, ఓటర్లు, మహిళలు, పురుషుల, ఇతరుల వివరాలతో తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల తుది జాబితాను ఈ నెల 10న పబ్లిష్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
- జిల్లాలో 50 వార్డులు..
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాల్టీలో 20 వార్డులు, 13,905 ఓటర్లు ఉండగా, కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో 51205ఓటర్లు, 30 వార్డులున్నాయి. 2020 ఎన్నికల జాబితాలోని ఓటర్లను చేర్పులు, మార్పులు చేస్తున్నారు. ఆయా వార్డులకు సంబంఽధించిన ప్రత్యేక అధికారులు చని పోయిన ఓటర్లు ఎంత మంది ఉన్నారు..? స్థానికంగా లేని వారు ఎంత మంది ఉన్నారు..? అనే వివరాలను క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలను సేకరించారు. ఈ నెల 5న అన్ని రాజకీయా పార్టీలతో మున్సిపాల్టీ కార్యాలయాల్లో అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తుది ఓటరు జాబితాపై సమీక్షా సమావేశం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఒక వైపు ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు అడుగులు వేస్తుండడంతో ఆయా రాజకీయ పార్టీల నాయకులు కౌన్సిలర్ బరిలో ఉండే అభ్యర్థుల కోసం వేట మొదలెట్టారు. రిజర్వేషన్లలో మార్పు వస్తే బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు సిద్ధ చేసుకున్నారు. గెలుపు గుర్రాల కోసం ఆ యా పార్టీల నాయకులు కసరత్తు ప్రారంభించారు.
- రాజకీయ పార్టీల్లో మొదలైన హడావుడి
పంచాయతీ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీ సీ ఎన్నికలు తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహి స్తారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మున్సిపల్ ఎన్నికలు ముందుకు వచ్చాయి. దీంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. పోటీ చేయాలనుకున్న వారంతా ఎన్నికల కోసం సిద్ధవుతుండడంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. కాగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కావడంతో ఆశావహుల్లో రిజర్వేషన్‌లపై ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో ఏ వార్డు ఏ కేటగిరికి రిజర్వ్ అయింది.. ఇప్పుడు ఏ కేటగిరికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరందు కుంది. మున్సిపాలి టీల పరిధిలో వార్డుల పునర్విభజన పూర్తయినప్పటికీ మహిళలు, పురు షులు, ఇతర ఓటర్లతో పాటు సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్ల లెక్కింపు పై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. సామాజిక వర్గాల వారీగా లెక్కింపు ప్రక్రియను సైతం త్వరలో పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరుగడం తమ మద్దతు దారులే అంటూ ప్రచారం చేసి ఎలాగో గట్టెక్కించారు. ఈ ఎన్నికల్లో మాత్రం సంబంధిత పార్టీల బీఫాంతో బరిలో ఉండే అవకాశాలుండడంతో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తోందన్న అంశం పక్కాగా లెక్కలు తేలుతాయి. దీంతోనే ఆయా పార్టీల నాయకులకు సైతం గుబులు పుట్టిస్తోంది. రాష్ట్రలోని అధికారంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోనుందుకు ఊవ్విళ్లూరుతుండగా, ప్రతిపక్షాలు సైతం ప్రజావ్యతిరేకత ఉందని నిరూపించుకునేందుకు ఇదే వేదిక కానుండటంతో ఈ ఎన్నికలు అందరికి అగ్ని పరీక్షగా ఏర్పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత కరెంటు పథకాలు అర్హులైన నిరూపేదలకు అందుతుండటంతో తమకే ప్రజలు పట్టం కడుతారన్న ధీమాలో ఆ పార్టీ నాయకులు ఉండడం విశేషం. బీఆర్‌ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావటం లేదని, రైతు బంధు సహాయం అందటం లేదని, ప్రతి నెల ఆయా మున్సిపాల్టీలకు ప్రత్యేక నిధుల విడుదల లేనేలేదన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపు బావుట సాధించేందుకు పక్కగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వ్యూహాలను రూపొందిస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అన్నీ మున్సిపాల్టీలకు ప్రత్యేక నిధులను కేటాయిస్తోందని ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంతా సిద్దం చేస్తున్నారు.
తుది జాబితా కోసం ఏర్పాట్లు చేస్తున్నాం..
- రాజేందర్, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్
మున్సిపాలిటీలో ఉండే ఓటర్ల తుది జాబితాను ఈ నెల 10న పబ్లిష్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఉన్న ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు చేస్తున్నాం. అలాగే చనిపోయిన వారిని కూడా తొలగించాం. త్వరలోనే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి తుది జాబితాను వెలువరిస్తాం.