Share News

యూనియన్‌ ఎన్నికలకు కసరత్తు

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:24 AM

ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు కోసం యూనియన్‌ ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం సిద్ధమవుతోంది.

యూనియన్‌ ఎన్నికలకు కసరత్తు

ఆర్టీసీలో గుర్తింపు సమరం

రీజియన్‌ పరిధిలో ఏడు డిపోల్లో ఎన్నికలు

తొలి నోటిఫికేషన్‌కు సన్నాహాలు

నల్లగొండ, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు కోసం యూనియన్‌ ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం సిద్ధమవుతోంది. ఆర్టీసీలో ఎన్నికల నిర్వహణ కోసం నోడల్‌ అధికారిగా నియామకమైన జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం నిర్వహించడంతో పాటు అందుకు సంబంధించి రీజియన్‌ పరిధిలో అన్ని డిపోల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్‌ బూత్‌ల వివరాలు, బూత్‌ ఇన్‌చార్జి జాబితాను యాజమాన్యం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ అధికారికి అందజేసింది. అర్హులైన కార్మిక సంఘాలు, ఆయా సంఘాల వివరాలు పరిశీలిస్తున్న రాష్ట్రస్థాయి నోడల్‌ అధికారి తొలి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలం తర్వాత ఆర్టీసీలో జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా యాజమాన్యంతో పాటు ఎన్నికల అధికారి మధ్య నిరంతరం సమీక్షలతో పాటు సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో గుర్తింపు సంఘాలన్నింటినీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణతో పాటు ప్రభుత్వంలో విలీనం వంటి అంశాలతో కార్మికులు ఇటీవల సమ్మెకు దిగారు. అప్పట్లో సమ్మెకు రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌తో పాటు పోలింగ్‌ తేదీలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. గెలుపొందిన సంఘం తో ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాతే ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియ కూడా జరగనున్నట్లు తెలిసింది. తరుచూ సమ్మె జరుగుతుండటంతో అప్పటి ప్రభుత్వం సంఘాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల్లో వెలువెత్తుతున్న డిమాండ్‌తో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించడంతో ఎన్నికల ఏర్పాటుకు చురుకుగా చేస్తున్నారు.

2016లో చివరిసారి ఎన్నికలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు పోరాటం చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించింది. 2016 సంవత్సరం జూలై 19వ తేదీన ఆర్టీసీలో చివరి సారిగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఆర్టీసీలో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికల షెడ్యూల్‌తో పాటు పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితా తయారీ వంటి సమాచారాన్ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్లు కొత్త కళ సంతరించుకోబోతున్నాయి.

కార్మికుల్లో ఉత్సాహం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సంఘాలు ఉన్న సమయంలో సమస్యల పరిష్కారం, హక్కుల కోసం కష్టాలు చెప్పుకోవడానికి సంఘాల నేతలు ఉండేవారు. విధి నిర్వహణలో ఉద్యోగులకు, కార్మికులకు ఇబ్బంది ఎదరైతే సంఘాల నేతలు అండగా ఉండేవారు. సంఘాలు రద్దు కావడంతో కార్మికులు నిరుత్సాహ పడ్డారు. తాజాగా ప్రభుత్వం గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావడంతో ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో కార్మికుల్లో ఉత్సాహం మొదలైంది. రీజియన్‌ పరిధిలో దేవరకొండ, కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ, యాదగిరి గుట్ట, నార్కట్‌పల్లి డిపోలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఏడు డిపోల పరిధిలో 2700 నుంచి 3వేల మంది వరకు ఉద్యోగులు, కార్మికులు ఉంటారు. వీరందరికీ సంబంధించిన పేర్లతో త్వరలో ఓటరు జాబితా తయారు కానుంది. పలు సంఘాలు రీజియన్‌ పరిధిలో కార్మికుల కోసం పనిచేస్తున్నాయి. ఈ సంఘాలన్ని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ప్రతి ఓటరు ఆయా సంఘాలకు సంబంధించి రాష్ట్ర గుర్తింపు కోసం ఒక ఓటును, జిల్లా గుర్తింపు కోసం మరో ఓటును మొత్తంగా రెండు ఓట్లను ప్రతి ఓటరు వేయాల్సి ఉంటుంది. చాలా సంవత్సరాల తరువాత ఆర్టీసీలో ఎన్నికలు జరుగుతుండటంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్‌ వెలువడిన వెంటనే ఆర్టీసీ సంఘాలు ముమ్మరంగా ప్రచారాన్ని సాగించనున్నాయి. ఏడు డిపోలలో ఫలితాల ఆధారంగా ఆయా డిపోలలో అధిక ఓట్లు సాధించిన యూనియన్‌కు జిల్లా స్థాయిలో గుర్తింపు లభించనుంది.

మార్గదర్శకాలు రాగానే ఎన్నికల ప్రక్రియ

ఆర్టీసీలో యూనియన్‌ ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తాం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తాం. యూనియన్ల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ రాగానే అందుకు సంబంధించి చర్యలు తీసుకుంటాం. ఓటర్ల జాబితాతో పాటు మిగతా పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు ఇతర అంశాల గురించి సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం.

జోత్స్న, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ

Updated Date - Jul 02 , 2026 | 12:24 AM