Share News

పెళ్లికి ముందే తలసేమియా పరీక్షలు చేయించుకోవాలి

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:08 AM

యువతీ యువకులు పెళ్లికి ముందు కచ్చితంగా తలసేమియా పరీక్షలు చేయించుకోవాలని, తద్వా రా పుట్టబోయే పిల్లలకు ఈ జన్యుపరమైన వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి...

పెళ్లికి ముందే తలసేమియా పరీక్షలు చేయించుకోవాలి

  • నారా భువనేశ్వరి పిలుపు.. మే 10న హైదరాబాద్‌లో రన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): యువతీ యువకులు పెళ్లికి ముందు కచ్చితంగా తలసేమియా పరీక్షలు చేయించుకోవాలని, తద్వా రా పుట్టబోయే పిల్లలకు ఈ జన్యుపరమైన వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌భవన్‌లో మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో కలిసి ఆమె మాట్లాడారు. ‘తలసేమియా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు ప్రతి 21 రోజులకోసారి రక్తం మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇది వారి కుటుంబాలకు ఆర్థిక భారంగా మారింది. అలాంటి నిరుపేద కుటుంబాలకు సాయం చేయడానికే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘తలసేమియా కేర్‌ సెంటర్‌’ను ప్రారంభించాం. ఇప్పటివరకు 227 మంది చిన్నారులకు ఉచితంగా రక్తమార్పిడి చేసి, మందులను అందించడంతో పాటు భోజన సదుపాయాన్ని కూడా కల్పించాం’ అని భువనేశ్వరి వివరించారు. ప్రజల్లో ఈ వ్యాధి పట్ల చైతన్య తెచ్చేందుకు మే 10న ఆదివారం ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ జలవిహార్‌ వద్ద 3కె, 5కె, 10కె తలసేమియా రన్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రన్‌లో పాల్గొనదలచిన వారు బుక్‌ మై షో యాప్‌ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. అతి త్వరలో విజయవాడలోనూ తలసేమియా కేర్‌ సెంటర్‌ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.

Updated Date - Apr 12 , 2026 | 04:08 AM