Share News

మా వద్ద వైద్య పరికరాల్లేవ్‌..!

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:30 AM

పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీకి వైద్యం అందించాల్సింది పోయి.. తగిన దగ్గర పరికరాలు లేవంటూ నర్సంపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు చేతులెత్తేశారు..

మా వద్ద వైద్య పరికరాల్లేవ్‌..!

  • గర్భిణిని చేర్చుకోని నర్సంపేట ప్రభుత్వాస్పత్రి వైద్యులు

  • అంబులెన్స్‌లోనే ప్రసవం.. 108 సిబ్బంది చొరవ, తల్లీబిడ్డ క్షేమం

నర్సంపేట టౌన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీకి వైద్యం అందించాల్సింది పోయి.. తగిన దగ్గర పరికరాలు లేవంటూ నర్సంపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించాల్సి వచ్చింది. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన దారంగుల మమత(24)కు నెలలు నిండక ముందే పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు చేర్చుకోకుండానే వరంగల్‌ తీసుకెళ్లాలంటూ వెనక్కి పంపారు. దీంతో కుటుంబసభ్యులు చేసేదేమీ లేక 108 వాహనంలో వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. గమనించిన సిబ్బంది అంబులెన్స్‌లోనే అత్యవసరంగా ప్రసవం చేయగా, మమత మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రాథమిక చికిత్స అనంతరం వారిద్దరిని వరంగల్‌ సీకేఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, అంబులెన్స్‌లో ఉన్న సౌకర్యాలు ఆస్పత్రిలో ఉండవా ?అంటూ బాధితురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి సబ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతాప్‌ వివరణ కోరగా.. నెలలు నిండని గర్భిణీ కావడం వల్లే ముందుజాగ్రత్తగా వరంగల్‌కు రెఫర్‌ చేశామని అన్నారు. అత్యాధునిక పరికరాల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించామని చెప్పారు.

Updated Date - Feb 26 , 2026 | 02:30 AM