లేత ప్రాయానికి పెద్ద బరువు
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:45 AM
వారిది ఇంకా ఆడిపాడే వయసే.. ఎదిగీ ఎదగని మనస్సే.. చదివేది ఏడో, ఎనిమిదో తరగతి.. ఆ స్థితిలోనే వారు యుక్త వయసులోకి అడుగు పెడుతున్నారు. లేత ప్రాయంలోనే రజస్వల.....
చిన్న వయసులోనే రజస్వల అవుతున్న బాలికలు.. పిల్లల తోపాటు తల్లిదండ్రులకూ మానసిక క్షోభ
ప్రికాషియస్ ప్యూబర్టీని ఆపేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు
ఆహారం, శారీరక వ్యాయామాలు ముఖ్యమంటున్న వైద్యులు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): వారిది ఇంకా ఆడిపాడే వయసే.. ఎదిగీ ఎదగని మనస్సే.. చదివేది ఏడో, ఎనిమిదో తరగతి.. ఆ స్థితిలోనే వారు యుక్త వయసులోకి అడుగు పెడుతున్నారు. లేత ప్రాయంలోనే రజస్వల (ఎర్లియర్లీ మెచ్యూర్) అవుతున్నారు. గతంలో 13 - 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలు మెచ్యూర్‌అయితే.. ఇప్పుడు 9-11 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. వైద్య పరిభాషలో దీనిని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. దీనివల్ల బాలికలతోపాటు వారి తల్లిదండ్రులు కూడా మానసిక క్షోభకు గురవుతున్నారు. దీన్నినివారించటానికి హార్మోన్ ఇంజెక్షన్లను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఇంజెక్షన్ల వాడకం పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. అయి తే, అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వీటి అవసరం ఉంటేనే ఇవ్వాలని సూచిస్తున్నారు.
ప్రికాషియస్ ప్యూబర్టీకి కారణాలు
ఆహారపు అలవాట్లు మారటం. అలా్ట్రప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తీసుకోవటం.
శారీరక వ్యాయామం లేకపోవటం.
తినే ఆహారంలో ఐరన్ లోపించటం.
బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) విపరీతంగా పెరిగి హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం.
ప్రికాషియస్ ప్యూబర్టీ వల్ల వచ్చే సమస్యలు
పీరియడ్స్ గురించి తెలియక బాలికలు ఇబ్బంది పడతారు.
మెటబాలిక్ సిండ్రోమ్, టైప్-2 మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
రజస్వల అయిన తర్వాత మొదటి ఐదారేళ్ల వర కు నాణ్యమైన అండాలు ఉత్పత్తవుతాయి. చివరి పదేళ్లలో అండాల ఉత్పత్తిలో నాణ్యత తగ్గుతుంది. ఇలాంటి వారు ఆలస్యంగా వివాహాలు చేసుకుంటే సంతానోత్పత్తి కష్టమవుతుంది.

ఆహార, వ్యాయామ సమతుల్యత ముఖ్యం
ఆడపిల్లలు చిన్న వయసులోనే అధిక బరువు పెరిగి హార్మోన్ల ప్రభావంతో త్వరగా రజస్వల అవుతున్నారు. దీంతో పదేళ్లలోపే బాల్యాని కోల్పోవాల్సి వస్తోం ది. కొలస్ట్రాల్, షుగర్, బీపీ పెరగుతున్నాయి. కొందరిలో 13 ఏళ్లకే పీసీఓడీ సమస్య వస్తోంది. వివాహం తర్వాత గర్భధారణలో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే ఆడపిల్లలు రోజూ అరగంట నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేసేలా చూడాలి. ఆరోగ్యంపై కౌన్సెలింగ్ ఇవ్వాలి. తరగతి పాఠంలో సైన్స్ ఎడ్యుకేషన్ మొదలు పెట్టినప్పటి నుంచే ఇంట్లో తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలి. ఆరేళ్ల వయస్సు నుంచే ఆహారం, శరీర బరువు విషయంలో క్రమశిక్షణ అలవాటు చేయాలి.
- డాక్టర్ పూజిత, సీనియర్ గైనకాలజిస్టు, స్టార్ ఆస్పత్రి

ప్రతి మూడు నెలలకు ఒక ఇంజెక్షన్
చిన్న వయసులోనే ఆడపిల్లల్లో ఎదుగుదల అంశాలను గుర్తించి అవసరమైన వైద్యం అందించాలి. వక్షోజాల్లో మార్పులు కనిపించగానే పిల్లల వైద్యులను కలవాలి. వైద్యులు రక్త పరీక్షలు, ఎక్స్‌రే, గర్భసంచి స్కాన్ వంటి పరీక్షలు చేసి అవసరమైతే వైద్యం అందిస్తారు. ప్రికాషియస్ ప్యూబర్టీని నివారించేందుకు హార్మోన్ ఇం జెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. 11-12 ఏళ్ల వయసొ చ్చే వరకు ఈ ఇంజెక్షన్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. వీటివల్ల చిన్నచిన్న దుష్ప్రభావాలు ఉంటాయి. వాటికి సప్లింమెంటరీమెడిసిన్, ఆహారంలో మార్పులు చేసి సర్దుబాటు చేస్తారు. ఈ ఇంజెక్షన్లు ఆపేసిన తర్వాత 6 నెలల నుంచి 2 ఏళ్ల లోపు రజస్వల అయ్యే అవకాశం ఉంటుంది.
- డాక్టర్ కిషోర్ బస్కే, పీడియాట్రిక్ ఎండోక్రనాలజిస్టు, కిమ్స్ ఆస్పత్రి