Share News

ప్రజల వద్దకు పాలనలా ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:38 AM

ప్రజల వద్దకు పాలనను చేర్చి, ఎక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేలా ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ ....

ప్రజల వద్దకు పాలనలా ప్రజాదర్బార్‌

  • ఎక్కడికక్కడే ప్రజాసమస్యలకు పరిష్కారం

  • రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో శ్రీకారం

హైదరాబాద్‌/ఖమ్మం/నేలకొండపల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల వద్దకు పాలనను చేర్చి, ఎక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేలా ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరులోని నేలకొండపల్లి, రాయగూడెం, తిరుమలాయపాలెం మండలాల్లో జిల్లా అధికారులతో కలిసి శనివారం ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి పొంగులేటి శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఆయన.. వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజలకు పాలనను చేరువచేసి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతోందన్నారు. ప్రస్తుతం ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో మోడల్‌గా ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

రేపటి నుంచి కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు

రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల పురోగతిపై ఈనెల 27 (సోమవారం) నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. తొలి సమావేశాన్ని హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తామని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అన్ని జిల్లాల్లో దశల వారీగా క్షేత్రస్థాయి సమీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలివిడతగా మూడున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, సుమారు లక్షకు పైగా ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధమైనట్లు తెలిపారు. భూవివాదాలు, పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ, ఇంటిగ్రేటెడ్‌ భూభారతి, భూధార్‌, సర్వే మ్యాప్‌ వంటి అంశాలపైనా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 04:38 AM