గ్రామీణులకు చేరువగా ‘ప్రజావాణి’
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:17 AM
అనేక వ్యయప్రయాసలకు గురవుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామీణులు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దీంతో గ్రామీణుల ముంగిటకు అధికార యంత్రాంగాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించే విధంగా దిశా నిర్దేశం చేస్తూ ఆదేశాలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అనేక వ్యయప్రయాసలకు గురవుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామీణులు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దీంతో గ్రామీణుల ముంగిటకు అధికార యంత్రాంగాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించే విధంగా దిశా నిర్దేశం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వికేంద్రీకరణతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాలు, 260 గ్రామాల ప్రజలకు వెసులుబాటు కలుగుతుంది. ఎంపీడీవో నోడల్ అధికారిగా ప్రజావాణి కార్యక్రమాన్ని వెంటనే అమలుచేసే విధంగా ఆదేశాలు ఉన్న ఈనెల 10వ తేదీ సోమవారం బోనాల పండుగ సెలవు ఉండడంతో మరో సోమవారం 17వ తేదీ నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి మొదలవుతుందని తెలుస్తోంది. కానీ గ్రామీణ ప్రజలు మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి ఉపయోగించుకుంటారా అనే సందిగ్ధం లేకపోలేదు. గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా భవన్ తర్వాత జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజావాణి ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా మే 4 రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ప్రజావాణి ప్రారంభించారు. సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ కార్యాలయం పరిధిలో సిరిసిల్ల మున్సిపాలిటీ, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో 157 గ్రామాలు, వేములవాడ రెవెన్యూ డివిజనల్ పరిధిలో వేములవాడ మున్సిపాలిటీ, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయిన్‌పల్లి మండలాల్లో 103 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు విన్నవించుకునే విధంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజావాణి ఆర్డీవో స్థాయిలో ఏర్పాటు చేసి మూడు నెలలు గడుస్తున్నా దరఖాస్తులు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడానికి ప్రజలు ముగ్గు చూపుతున్నారు. ఆర్డీవోలకు ఒకటి రెండు దరఖాస్తులు మాత్రమే వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఐదు, ఆరు దరఖాస్తులు దాటడం లేదు. మూడు నెలల్లో సిరిసిల్ల, వేములవాడ ఈర్డీవోలకు 178 దరఖాస్తులు వచ్చాయి. ప్రతి సోమవారం కలెక్టర్‌కు 200 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. ఈక్రమంలో మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మండల పరిషత్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు...
జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీవో నోడల్ అధికారిగా ప్రజావాణి నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. భూ వివాదాలు, ధరణి సంబంధిత సమస్యలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీటి సరఫరా, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, రోడ్లు తదితర సమస్యలపై గ్రామీణులు ఇప్పటివరకు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు సమస్యలను విన్నవించుకునేవారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు నోడల్ అధికారులుగా మూడు నెలలుగా ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇకనుంచి ఈ సమస్యలన్నిటిని మండల స్థాయిలోనే సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సమక్షంలో పరిష్కారం కోరుతూ వినతులు, సమస్యలపై దరఖాస్తులను చేసుకునే వీలు కల్పిస్తున్నారు. మండల ప్రజావాణికి దాదాపు 23 శాఖల నుంచి అధికారులు హాజరవుతారు. తహసీల్దార్, వ్యవసాయ, ఉద్యాన, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, గృహ నిర్మాణం, మిషన్ భగీరథ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్ ఇలా అధికారులు అందరూ ప్రజావాణికి వస్తారు.
సమస్యలపై జవాబుదారీతనం..
జిల్లాలో మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఒకే వేదికపై ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ ఉండి గ్రామీణ స్థాయి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు అధికారులు జవాబుదారీతనంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కల్పిస్తున్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదును దరఖాస్తుదారునికి ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుదారునికి ఇచ్చిన ఐడీ నంబర్ ఆధారంగా ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది, ఏ అధికారి దగ్గర పెండింగ్‌లో ఉందో తెలుస్తుంది. దీనివల్ల సమస్యను అధికారులు త్వరగా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రజావాణికి వచ్చే దరఖాస్తు ఉన్నత అధికారుల పరిశీలిస్తారనే భయం, జవాబుదారీతనం ఉంటుందని భావిస్తున్నారు.
తగ్గనున్న దూర, ఆర్థిక భారం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామాల ప్రజలు సమస్యలు కలెక్టర్‌కు విన్నవించుకోవడం ద్వారా పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసంతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వస్తున్నారు. దీనివల్ల దూర భారమే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు కూడా పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్నారు. పలు మండలాలు కలెక్టరేట్‌కు 40 కిలోమీటర్ల పైనే దూరం ఉన్నప్పటికీ ప్రజలు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. దీనికి తోడు ఒక్కో దరఖాస్తుదారుడు తన సమస్యను విన్నవించుకోవడానికి రూ.200లకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం అవుతోంది. ఒకసారితో సమస్య తీరడం లేదని, నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న వారూ ఉన్నారు. అంతేకాకుండా సిరిసిల్ల బస్టాండ్ నుంచి కలెక్టరేట్ చేరుకోవాలంటే ఆటో చార్జి రూ.150 వసూలు చేస్తున్నారు. ఎంతో ఇబ్బంది పడుతూ దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చిన వారికి కనీసం కూర్చోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఉంది. గంటల తరబడి నిలబడి అర్జీలు ఇస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి గ్రామాల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు.