Share News

రూ.37లక్షలు ప్రజాభవన్‌ ఆస్తి పన్ను బకాయి ఇది

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:12 AM

రాష్ట్రంలో ఎవరైనా ఆస్తి పన్ను చెల్లించకపోతే మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ అధికారులు ఉపేక్షించరు. నోటీసులు జారీ చేసి నానా హడావుడి చేసి..

రూ.37లక్షలు ప్రజాభవన్‌ ఆస్తి పన్ను బకాయి ఇది

  • 2022-23 నుంచి ఐదేళ్లుగా జీహెచ్‌ఎంసీకి పెండింగ్‌

  • ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి అధికార నివాసం ఈ భవనం

  • అప్పట్లో ప్రగతిభవన్‌ పేరిట కేసీఆర్‌ నివాసం

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల నుంచి..జీహెచ్‌ఎంసీ రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలు 6,357 కోట్లు!

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎవరైనా ఆస్తి పన్ను చెల్లించకపోతే మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ అధికారులు ఉపేక్షించరు. నోటీసులు జారీ చేసి నానా హడావుడి చేసి.. పన్ను చెల్లించకపోతే సంబంధిత ఆస్తిని సీజ్‌ చేస్తామంటూ యజమానులను హడలెత్తిస్తారు. ఇదంతా సామాన్యులకే పరిమితమనే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌కు సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపులు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)కు ఐదేళ్లుగా జరగకపోవడమే ఇందుకు నిదర్శనం. అవును.. ప్రజాభవన్‌ నుంచి జీహెచ్‌ఎంసీకి సుమారు రూ.37లక్షల ఆస్తి పన్ను బకాయి రావాల్సి ఉంది. బేగంపేట ప్రాంతంలోని ప్రజాభవన్‌ కోసం రాష్ట్రంలో తెలియని వారుండరూ. మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భవనంలోనే నివాసముండేవారు. అప్పట్లో ఆ భవనాన్ని ప్రగతి భవన్‌ అని పిలిచేవారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రగతిభవన్‌ పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రస్తుతం ఆ భవనంలో నివాసముంటున్నారు. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ.37 లక్షల ఆస్తి పన్ను ప్రజాభవన్‌ నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉంది. ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని ఈ భవనానికి సంబంధించిన ఆస్తిపన్ను డిమాండ్‌ ఏటా రూ.5,28,090. అయితే, 2022-23, 2023-24, 2024-25, 2025-26 వరకు నాలుగు ఆర్థిక సంవత్సరాల బకాయి రూ.31.68 లక్షలు ఉంది. ఇందులో అసలు పన్ను రూ.21.12 లక్షలు కాగా వడ్డీ రూ.10.56 లక్షలుగా ఉంది. 2026-27 (ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం) పన్ను రూ.5.28 లక్షలతో కలిపితే మొత్తం బకాయి రూ.37లక్షలకు చేరుతోంది. ప్రజాభవన్‌ 1.67లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతకుముందు 1.23 లక్షల చదరపు అడుగులకు రూ.3.83 లక్షల పన్ను ఉండగా.. 2021లో సవరణ అనంతరం నిర్మాణ విస్తీర్ణం పెరగడంతో పన్ను డిమాండ్‌ రూ.5.28 లక్షలకు పెంచారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు విభాగాలు జీహెచ్‌ఎంసీకి రూ.6,357 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయి పడ్డాయి. పన్నులను చెల్లించాలని కోరుతూ ఆయా విభాగాలకు జీహెచ్‌ఎంసీ లేఖలు రాసినా స్పందన ఉండడం లేదు. ఆస్తి పన్నుల వసూలు విషయంలో సామాన్యులను హడలెత్తించే అధికారులు.. మరీ ప్రజాభవన్‌ లాంటి ప్రభుత్వ భవనాల విషయంలో మాత్రం మిన్నకుండడం గమనార్హం.

Updated Date - Apr 22 , 2026 | 04:12 AM