Share News

కరెంటుకు కటకటే..!

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:26 AM

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలను దాటేస్తోంది. కేంద్ర విద్యుత్‌ సంస్థ (సీఈఏ) అంచనాలను దాటి రికార్డు స్థాయిలో డిమాండ్‌ నమోదవుతోంది.

కరెంటుకు కటకటే..!
cc

  • రాష్ట్రంలో అంచనాలను మించుతున్న డిమాండ్‌.. కేంద్ర విద్యుత్‌ సంస్థ అంచనాలను దాటేసి రికార్డులు

  • ఈ నెల 9న రాష్ట్రంలో

  • గరిష్ఠ డిమాండ్‌ 19,543 మెగావాట్లు

  • ఖరీఫ్‌లో అసాధారణ వినియోగం,

  • 17 శాతం డిమాండ్‌ పెరుగుదల

  • అన్ని మార్గాల నుంచీ సేకరించినా రాత్రి సమయంలో 1,400 మెగావాట్ల లోటు

  • 2034-35లో 44,388 మెగావాట్ల

డిమాండ్‌ ఉంటుందని అంచనా

  • డిమాండ్‌కు తగ్గట్లుగా పెరగని ఉత్పత్తి

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలను దాటేస్తోంది. కేంద్ర విద్యుత్‌ సంస్థ (సీఈఏ) అంచనాలను దాటి రికార్డు స్థాయిలో డిమాండ్‌ నమోదవుతోంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్‌ కొనుగోళ్లు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 9న ఉదయం 10:41 గంటల సమయంలో రాష్ట్రంలో 19,543 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. ఈ డిమాండ్‌ను తీర్చడంలో తెలంగాణ జెన్‌కో థర్మల్‌ కీలక పాత్ర పోషించింది. 3,996 మెగావాట్లను జెన్‌కో, 1,104 మెగావాట్లను సింగరేణి, సెమ్‌కార్బ్‌ నుంచి 158 మెగావాట్లు, కేంద్ర విద్యుత్‌ సంస్థల నుంచి 2,317 మెగావాట్లు కలుపుకోగా... మరో 6,306 మెగావాట్లను సోలార్‌ తీర్చింది. విండ్‌ నుంచి 10 మెగావాట్లు, ఇతరుల నుంచి 459 మెగావాట్లను తీసుకోగా... 5,193 మెగావాట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేశారు. అయితే, ఆ తర్వాతే అసలు సమస్య ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల సమయంలో సౌర విద్యుత్‌ ఉత్పాదన భారీగా తగ్గిపోయి 432 మెగావాట్లు మాత్రమే లభించింది. జలవిద్యుత్‌ రూపంలో 1,317 మెగావాట్లు, థర్మల్‌ నుంచి 8,556 మెగావాట్లు లభించింది. దీంతో 1,400 మెగావాట్ల లోటు నమోదైంది. ఈ ఏడాది ఖరీఫ్‌ డిమాండ్‌ అసాధారణంగా నమోదైంది. 2022 ఖరీ్‌ఫలో ఒకరోజులో అత్యధికంగా 13,191 మెగావాట్ల డిమాండ్‌ ఉండగా, 2023లో 15,370 మెగావాట్లు, 2024లో 15,573 మెగావాట్లు, 2026లో 16,613 మెగావాట్లు నమోదైంది. అయితే, ఈ నెల 9వ తేదీన ఏకంగా 19,543 మెగావాట్ల డిమాండ్‌ ఏర్పడింది. ఇది 17 శాతం అదనం. ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టులు/చెరువుల్లో నీరు అడుగంటడంతో బోరుబావుల కింద సాగు పెరగటమే విద్యుత్‌ డిమాండ్‌ పెరగటానికి కారణమని అధికారులు తెలిపారు.


కరెంట్‌ లోటు కష్టాలు

రాష్ట్రంలో విద్యుత్‌ లోటు రెండుమూడు వారాల్లోనే భారీగా పెరిగింది. ఆగస్టు 21వ తేదీన 660 మెగావాట్ల లోటు ఉండగా... ఈ నెల 8వ తేదీన 8,105 మెగావాట్లకు చేరింది. ఆగస్టు 14వ తేదీ నుంచి 20 వరకు ఎటువంటి లోటు లేకపోగా... ఈ నెల 10వ తేదీ నుంచి 21 వరకు 324.8 మిలియన్‌ యూనిట్ల లోటు కనిపించింది. 11వ తేదీన అత్యధికంగా 48 మిలియన్‌ యూనిట్ల లోటు నమోదైంది. రాష్ట్రంలో గణనీయంగా కొత్త పరిశ్రమలు, డేటా సెంటర్లు ఏర్పాటవుతుండటంతో జెన్‌కో ఆధ్వర్యంలో కొత్త విద్యుత్‌ కేంద్రాలు కట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రామగుండంలో 800 మెగావాట్లు, పాల్వంచలో కేటీపీఎస్‌ ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయటంలేదు.


భారీగా పెరగనున్న డిమాండ్‌

రానున్న రోజుల్లో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరగనుందని సీఈఏ అంచనా వేసింది. 2027-28లో 20,968 మెగావాట్లు, 2028-29లో 22,488మెగావాట్లు, 2029-30లో 24,215 మెగావాట్లు, 2030-31లో 25,639 మెగావాట్లు, 2031-32లో 27,059 మెగావాట్లు, 2032-33లో 28,558 మెగావాట్లు, 2033-34లో 30,139 మెగావాట్లు, 2034-35లో 31,809మెగావాట్ల డిమాండ్‌ ఉంటుందని సీఈఏ లెక్కలేసింది. వాస్తవ పరిస్థితులు గమనిస్తే 2034-35లో విద్యుత్‌ డిమాండ్‌ ఏకంగా 33,773 మెగావాట్లు ఉంటుందని అధికారులు అంటున్నారు. తెలంగాణ రైజింగ్‌- 2047లక్ష్యం ప్రకారం అంచనావేస్తే 2034-35లో ఏకంగా 44,388 మెగావాట్ల డిమాండ్‌ ఉంటుంది. 2034-25 నాటికి సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యం 31వేల మెగావాట్లుగా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వాటా 6,725, పంప్డ్‌ స్టోరేజీ 5 వేల మెగావాట్లుగా ఉంటుందని అంచనావేసినా.. పరిస్థితులు అనుకూలంగా లేవు.

Updated Date - Sep 26 , 2026 | 06:30 AM