Telangana Health Projects: పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు?
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:48 AM
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పనుల్లో తీవ్ర జాప్యం
ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు
సనత్‌నగర్ టిమ్స్ సిద్ధమైనా సేవలకు మరికొంత సమయం.. తుది దశకు అల్వాల్ టిమ్స్ భవనం
ప్లాన్‌లో మార్పులతో కొత్తపేట టిమ్స్ ఆలస్యం
వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీకి మరో ఆర్నెల్లు
హైదరాబాద్ సిటీ, వరంగల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్, కొత్తపేట, అల్వాల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మెడికల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్(టిమ్స్) ఆస్పత్రులు, వరంగల్‌లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పరిస్థితి దాదాపుగా ఒకేలా ఉంది. అదిగో, ఇదిగో అని నేతలు మాటలు తప్పితే.. వేర్వేరు కారణాలతో ఆయా ఆస్పత్రుల పనుల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. వీటిల్లో సనత్‌నగర్ టిమ్స్ భవన నిర్మాణం పూర్తయినప్పటికీ వైద్య సేవలు ప్రారంభానికి మరికొన్ని నెలలు సమయం పట్టనుంది.నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలనుకున్నప్పటికీ వరంగల్ ఆస్పత్రి భవన పనులు ముందుకు సాగడం లేదు. అల్వాల్ టిమ్స్ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, కొత్తపేట టిమ్స్ భవన నిర్మాణాలు పూర్తవ్వడానికి మరో ఏడాది పట్టే అవకాశం కనిపిస్తుంది. నిజానికి, ఈ ఆస్పత్రులకు బీఆర్‌ఎస్ హయాంలో 2021లోనే రూపకల్పన చేశారు. 18 నెలల్లోనే ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువస్తామని నాటి సీఎం కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. కానీ, వేర్వేరు కారణాలతో పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత పనులు వేగం కాస్త పెరిగినా ఇంకా పూర్తవ్వలేదు.
సనత్‌నగర్ టిమ్స్ సిద్ధమే.. కానీ..!
సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి దాదాపు పూర్తయింది. దీంతో డిసెంబరు 9న ప్రారంభించాలనుకున్నారు. కానీ 2 నెలలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. టిమ్స్‌లో దశల వారీగా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తొలుత భావించారు. కానీ, ఆస్పత్రిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మూడు బ్లాక్‌లుగా భవనాలను నిర్మిస్తున్నారు. ఓపి సేవలు ఒక చోట, ఐపీ, ల్యాబ్ సేవలు వేర్వేరు బ్లాక్‌ల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో దశలవారీగా బ్లాక్‌లను ప్రారంభిస్తే రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉండడంతో ఆస్పత్రిని ఒకేసారి అందుబాటులోకి తేవాలనుకున్నారు. ఆస్పత్రికి అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో వచ్చేశాయని, ఒకటి, రెండు మినహా అన్ని అందుబాటులో ఉన్నాయని ఎర్రగడ్డ టిమ్స్ నోడల్ డైరెక్టర్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ తెలిపారు.
అల్వాల్‌లో కాస్త ఆలస్యం
అల్వాల్ టిమ్స్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఐదంతస్తుల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం టైల్స్, విద్యుత్ సరఫరా వంటి పనులు నిర్వహిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి ఇవి పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అవి పూర్తి కాగానే వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలను ఏర్పాటు చేసుకోగానే అన్ని విభాగాలను ఒకేసారి ప్రారంభించాలనుకుంటున్నారు.
స్లాబ్‌లు పూర్తయిన కొత్తపేట టిమ్స్
కొత్తపేట టిమ్స్ ఆస్పత్రికి సంబంధించి స్లాబ్‌లు, పిల్లర్ల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. భవన నిర్మాణం పూర్తవ్వడానికి మరో ఏడాదికిపైగా సమయం పట్టే అవకాశం ఉంది. 14 అంతస్తుల భవనం అనుకున్నా 12 అంతస్తులకు కుదించారు. ఇప్పటివరకు 11 అంతస్తుల వరకు స్లాబ్ పూర్తయింది. ముందు ప్లాన్‌లో ఇక్కడ మెడికల్ కాలేజీ లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీ పర్యవేక్షణలో ఇక్కడ సేవలు అందించాలని నిర్ణయించి దానికి అనుగుణంగా పనులు నిర్వహిస్తున్నారు.
వరంగల్‌లో మరో ఆరు నెలలు
వరంగల్ ఎంజీఎంకు అనుబంధంగా రూ.1,370 కోట్ల అంచనా వ్యయంతో 24అంతస్తుల్లో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం 2021లో ప్రారంభమైంది. ఈ నెలాఖరుకు భవన నిర్మాణంపూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. కానీ ఇంకా 20 శాతానికి పైగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు మార్చురీ భవనాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆస్పత్రి ప్రాంగణంలో విద్యుత్, ల్యాండ్ స్కేపింగ్ పనులతో పాటు మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉంది. ఆస్పత్రిలో బెడ్లు, ఇతర ఫర్నిచర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్లంబింగ్, ఫాల్ సీలింగ్, రంగులు వేసే పనులు కూడా చేపట్టాల్సి ఉంది. వైద్య పరికరాలు కూడా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తవ్వడానికి ఆరు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. వాస్తవంగా దసరా నాటికే ఈ ఆస్పత్రిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల్లో జాప్యంతో ఆ గడువును డిసెంబరు చివరి నాటికి పెంచారు. కానీ, వచ్చే మే/జూన్‌లో కూడా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు. వరంగల్ ఆస్పత్రి నిర్మాణానికి 2021లో అప్పటిప్రభుత్వం రూ.1,116 కోట్ల నిధులను డీపీఆర్‌కు అనుగుణంగా కేటాయించింది. అయితే జీవో లు, అనుమతుల్లేకుండా ఈ వ్యయాన్ని రూ.1,725.95 కోట్లకు పెంచేశారు. ఈ అంశంతోపాటు జైలు స్థలాన్ని తాకట్టుపెట్టి ఆస్పత్రి పేరుతో రుణం తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోరెనిక్స్ ఆడిట్, విజిలెన్స్ విచారణలకు ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలున్నాయి.