kumaram bheem asifabad- పూలాజీ బాబా బోధనలు ఆచరణీయం
ABN , Publish Date - Aug 30 , 2026 | 10:50 PM
పూలాజీ బాబా బోధనలు ఆచరణీయమని ఎంపీ గోడం నగేష్ అన్నారు. జైనూర్ మండలం పట్నాపూర్‌లోని సిద్ధేశ్వర సంస్థాన్‌లో ఆదివారం నిర్వహించిన పూలాజీ బాబా జన్మదిన వేడుకలకు జిల్లా కలెక్టర్ కెహరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి హాజరయ్యారు
జైనూర్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పూలాజీ బాబా బోధనలు ఆచరణీయమని ఎంపీ గోడం నగేష్ అన్నారు. జైనూర్ మండలం పట్నాపూర్‌లోని సిద్ధేశ్వర సంస్థాన్‌లో ఆదివారం నిర్వహించిన పూలాజీ బాబా జన్మదిన వేడుకలకు జిల్లా కలెక్టర్ కెహరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలాజీ బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ బాబా చూపిన ఆధ్యాత్మిక, ధ్యాన మార్గాల ద్వారా ఎంతో మంది కుటుంబాలు వ్యసనాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో 1995 సంవత్సరం నుంచే పూలాజీ బాబాతో తనకు పరిచయం, అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. సిద్ధేశ్వర సంస్థాన్ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు బాబా మందిర నిర్మాణానికి ఎంపీ కోటా నుంచి రూ. 10 లక్షల మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆలయ పరిసరాలలో ఇతర మౌలిక వసతులు, అభివృద్ధి పనులను ఎన్‌ఆర్‌ఈజిఎస్ ద్వారా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు అభివృద్ధి పనులకు సహకరించాలని తెలిపారు. బాబా ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక విలువలు, సన్మార్గాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తాను వాంకిడి మండలాన్ని సందర్శించిన సమయంలో పూలాజీ బాబా చేసిన సేవల గురించి తెలుసుకున్నానని వివరించారు. వేలాది మంది భక్తులలో ఆధ్యాత్మిక మార్పు తీసుకువచ్చి, సమాజానికి గొపప సేవలు అందించిన పులాజీ బాబా సేవలు ప్రశంసనీయమని తెలిపారు. కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు సిద్ధేశ్వర సంస్థాన్ ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మకరందు మాట్లాడుతూ పూలాజీ బాబా అందించిన ఆధ్యాత్మిక సేవలు ఎంతో గొప్పవని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ పూలాజీ బాబా ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, బాబా అందించిన ఆధ్యాత్మిక సేవలు, చూపిన మార్గం ఆచరణీయమని తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ సిద్ధేశ్వర సంస్థాన్ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆలయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు దేవాదాయ శాఖతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడతానని తెలిపారు. .ఈ సందర్భంగా సిద్ధేశ్వర సంస్థాన్ కమిటీ అధ్యక్షుడు ఇంగ్లే కేశవ్ దాదా, కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు. అనంతరం పూలాజీ బాబా ఆధ్యాత్మిక సందేశాలు, పాటలపై రూపొందించిన పాటల సీడీలతో పాటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కందారే లక్ష్మి బాలాజీ, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నాయకులు అజ్మీర శ్యామ్ నాయక్, రితీష్ రాథోడ్, మాజీ ఎంపీ సోయం బాపూరావ్, మహారాష్ట్ర మాజీ శాసనసభ్యులు, విశ్రాంత కమిషనర్ సంభాజీ సర్కుండే, తుడుం దెబ్బ జాతీయ ప్రతినిధి కోట్నాక విజయకుమార్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథరావు, ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, ఐటీటీడీవో ఏపీవో ఆత్రం భాస్కర్, అంద్ సమాజ రాష్ట్ర అధ్యక్షుడు కుడె కైలాస్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ముకాడె విష్ణు, ప్రధాన కార్యదర్శి డుక్రె సుభాష్, మాగాడె దాదారావ్, ఆసిఫాబాద్ డీడీ అంబాజీ జాదవ్, ఏపీవో ఆత్రం భాస్కర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణవేణి, తహసీల్దార్ ఆడబీర్షావ్, డీఎస్పీ అశోక్, సీఐ రమేశ్, ఎస్సై రవికుమార్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.