పెట్రోల్ వాడొద్దని చెప్పి.. వేలాది కార్లతో రోడ్‌షోనా?
ABN , Publish Date - May 12 , 2026 | 04:00 AM
విదేశీ మారక నిల్వలను కాపాడుకొనేందుకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని దేశ ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ.. హైదరాబాద్‌లో వేలాది కార్లతో రోడ్‌షో ఎందు కు నిర్వహించారని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
బంగారం, పెట్రోల్ కొనొద్దని ప్రధాని చెప్పటమా?
తెలంగాణకు కోడిగుడ్డు సున్నా ఇచ్చి పోయారు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?
తన కుమారుడిపై విచారణను బండి అడ్డుకుంటే సహించబోం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మే 11(ఆంధ్రజ్యోతి): విదేశీ మారక నిల్వలను కాపాడుకొనేందుకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని దేశ ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ.. హైదరాబాద్‌లో వేలాది కార్లతో రోడ్‌షో ఎందు కు నిర్వహించారని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పెట్రోల్, బంగారం కొనొద్దని, వంటనూనెలను వాడొద్దని ప్రధాని స్వయంగా చెప్పటమేమిటని నిలదీశారు. ఆ మాటలు ఆయన స్థాయికి తగినవి కావని అన్నారు. గాంధీభవన్‌లో పొన్నం సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోదీ తెలంగాణకు వస్తుంటే ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తారని భావించామని, కానీ ఆయన పెద్ద కోడిగుడ్డు సున్నా ఇచ్చి పోయారని విమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై సికింద్రాబాద్ క్లాక్‌టవర్ సర్కిల్‌లో బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ‘తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 8మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారు? నిధులు కావాలని మోదీకి కనీసం వినతిపత్రం ఇచ్చారా? బీజేపీ అధిష్ఠానాన్ని చూస్తే ఆ పార్టీ రాష్ట్ర నేతలకు లాగులు తడుస్తున్నాయా?’ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రధాని మొదలుకుని కేంద్రమంత్రి బండి సంజయ్ వరకు అం దరూ మాట్లాడారని, మరి ఆ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరి నెలలు గడుస్తున్నా ఎందుకు చేయట్లేదని నిలదీశారు. తన కుమారుడిపై ఆరోపణలు వచ్చినప్పుడు.. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ స్వయంగా దర్యాప్తు కోరి ఉండాల్సిందని పొన్నం అన్నారు. ఇప్పటికైనా దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. తన అధికారాన్ని ఉపయోగించి దర్యాప్తునకు అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జనగణన గృహాల గుర్తింపు పత్రంలో ఎస్సీ, ఎస్టీకు ఉన్నట్లుగానే బీసీలకు ప్రత్యేక కాలమ్ చేర్చాలని ప్రధానికి ఆదివారం వినతిపత్రం అందించినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఓబీసీ కాలం లేకుంటే జనగణనలో పాల్గొనకండి: వీహెచ్
జనగణనలో భాగంగా గృహాల గుర్తింపు పత్రంలో ఓబీసీ కాలమ్ లేకుంటే జనగణన పక్రియలో పాల్గొనవద్దని బీసీలకు ప్రభుత్వ సలహాదారు వీహెచ్ పిలుపునిచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీసీ కులాల గణన చేయాలని ప్రధానికి చెప్పాలని సూచించారు. హైదరాబాద్ సభలో కాంగ్రెస్‌పార్టీపై అనుచిత వ్యాఖ్య లు చేసిన మోదీపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తోందని, బండి సంజయ్ సహా ఎవరూ చట్టానికి అతీతులు కారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్ అన్నారు. ప్రతిపక్షాలను బలహీనపరి బీజేపీ ఒక్కటే ఏకపార్టీ వ్యవస్థగా ఉండాలని మోదీ భావిస్తున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బెంగాల్ తరహాలో తెలంగాణనూ కైవసం చేసుకుంటామని ప్రధాని పగటి కలలు కంటున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఎద్దేవా చేశారు.