పొన్నం బావమరిది నామినేషన్ విత్‌డ్రా
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:26 AM
జనగామ మునిసిపాలిటీ 6వ వార్డు నుంచి నామినేషన్ వేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్‌కుమార్‌గౌడ్ పోటీ నుంచి తప్పుకొన్నారు.
పోటీ నుంచి వైదొలగిన నవీన్‌కుమార్‌గౌడ్
జనగామ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): జనగామ మునిసిపాలిటీ 6వ వార్డు నుంచి నామినేషన్ వేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్‌కుమార్‌గౌడ్ పోటీ నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు మంగళవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావించిన నవీన్‌గౌడ్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గానీ, ఇతర పార్టీ నుంచిగానీ బరిలో ఉండాలని నిర్ణయించుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ‘పొన్నం బావమరిదికి నిరాశ’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై టీపీసీసీ నాయకత్వం స్పందించింది. నవీన్‌గౌడ్‌ను బుజ్జగించే బాధ్యతను హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి అప్పగించింది. ఈ మేరకు రాజేందర్‌రెడ్డి జనగామకు వచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి నివాసంలో నవీన్‌గౌడ్ నామినేషన్ విత్‌డ్రాపై చర్చించారు. ఈ సమయంలో నవీన్‌గౌడ్ తండ్రి, మంత్రి పొన్నం ప్రభాకర్ మామ అయిన పెద్ది వెంకటనారాయణ గౌడ్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో మాట్లాడి నవీన్‌గౌడ్ నామినేషన్‌ను వెనక్కి తీసుకునేలా చూడాల్సిందిగా నాయిని కోరినట్లు తెలిసింది. దీంతో నవీన్ జనగామ మునిసిపల్ కార్యాలయానికి వచ్చి తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. ఈ సందర్భగా వెంకటనారాయణగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో రెబల్ అభ్యర్థులు ఎవరూ ఉండొద్దన్న సీఎం రేవంత్‌రెడ్డి సూచనలను గౌరవించి తాము పోటీ నుంచి తప్పుకొన్నామని తెలిపారు.