కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్నారు
ABN , Publish Date - May 30 , 2026 | 04:19 AM
ఇందిరమ్మ ఇళ్ల పథకం, డబుల్ బెడ్ రూమ్ పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్యన సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి.
మీకు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదు
కేటీఆర్ వ్యాఖ్యలకు ‘ఎక్స్’లో మంత్రి పొంగులేటి కౌంటర్
కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ ఇళ్లను నిర్మిస్తే.. మీరు పోటీకి దూరంగా ఉంటారా? అంటూ సవాల్
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల పథకం, డబుల్ బెడ్ రూమ్ పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్యన సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండం.. సవాల్‌ను స్వీకరించే దమ్ముందా కేటీఆర్? గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేకనే హైదరాబాద్ ఇండ్ల మీద పడ్డావ్... అదే హైదరాబాద్‌లో ఇళ్ల అంశంపై సవాల్ చేస్తే ఆ సవాల్‌ను స్వీకరించే ధైర్యం లేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావ్... చేతల ప్రభుత్వం కాబట్టే.. చిత్తశుద్ధి, సత్తా ఉన్నాయి కాబట్టే తొలి రెండున్నరేళ్లలో గ్రామాల్లో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాం. జూన్ 1న మరో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్ పరిధిలో తొలి విడతలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించబోతున్నాం. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లింది మీరు. ఈ విషయం స్వయంగా ప్రధాని మోదీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మీ సోదరి కవిత దగ్గర ప్రస్తావించారు. కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్న మీకు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదు. దళిత ముఖ్యమంత్రి నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్నీ మాటలు తప్ప.. చేతలు ఎక్కడైనా ఉన్నాయా డ్రామారావు? అవినీతి, అక్రమాల గురించి కేటీఆర్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. 2014కు ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? పదేళ్లు అధికారంలో ఉండి విచ్చలవిడిగా ఎలా దోచుకున్నారో.. ధరణి దందాలు, బినామీల బాగోతాలు, రియల్‌ఎస్టేట్ అక్రమాలు ప్రజలందరికీ తెలుసు. గ్రామాల్లో మీరు పదేళ్లలో కట్టిన ఇళ్లకంటే రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ ఇళ్లు నిర్మించింది. హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలపై మరో సవాల్ విసురుతున్నా... బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో కట్టిన ఇళ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లను నిర్మిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తా... కాంగ్రెస్ ఎక్కువ ఇళ్లను నిర్మిస్తే మీరు పోటీకి దూరంగా ఉంటారా? దమ్ముంటే సవాల్‌ను స్వీకరించు కేటీఆర్.’’ అంటూ ‘ఎక్స్’లో మంత్రి పొంగులేటి పోస్టు చేశారు.