Share News

గ్రామీణులకు 5 లక్షల ఇళ్లు కేటాయించండి

ABN , Publish Date - Feb 22 , 2026 | 07:00 AM

గ్రామీణ పేదలకు 5లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

గ్రామీణులకు 5 లక్షల ఇళ్లు కేటాయించండి

  • కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు రాష్ట్ర మంత్రి పొంగులేటి విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): గ్రామీణ పేదలకు 5లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను శనివారం కలిసిన పొంగులేటి.. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇళ్లు కేటాయించాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం, పేదలకు మంజూరు చేయాల్సిన ఇళ్లపై శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో చర్చించి వినతి పత్రం సమర్పించారు. 2014-23 మధ్య గ్రామాల్లో పేదల ఇళ్ల నిర్మాణమే జరగక.. పెద్ద ఎత్తున ఏర్పడిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అవసరమైన ఇళ్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన గత సర్కారు.. కేంద్రం నుంచి ఒక్క ఇల్లు కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. గత పదేళ్లలో కనీసం 10 వేల ఇళ్లు కూడా నిర్మించలేదని పొంగులేటి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాలకు ఇళ్లు మంజూరు చేయాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా గ్రామీణ ప్రాంతాలకు 3 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించాలని తమ సర్కారు లక్ష్యంగా పెట్టుకుందన్న మంత్రి పొంగులేటి.. ఇప్పటికే దాదాపు 4 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని కేంద్ర మంత్రికి వివరించారు.


గతంలో తెలంగాణ ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ (పీఎంఏజీవై 1.0)లో భాగస్వామ్యం కాలేదని చెప్పారు. 2023లో తమ సర్కారు ఏర్పాటైన తర్వాతే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల ప్రకారం పీఎంఏజీవై 2.0లో తెలంగాణ అధికారికంగా చేరిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అవాస్‌ ప్లస్‌-2024 మొబైల్‌ యాప్‌ ద్వారా రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో సుమారు 11.57 లక్షల అర్హులైన కుటుంబాలను గుర్తించామని, గత 12 ఏళ్లలో ఏర్పడిన పెండింగ్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్ర పరిస్థితులకు అర్థం చేసుకుని ఇళ్లు మంజూరు చేయాలని పొంగులేటి కోరారు. పేద కుటుంబాలకు సురక్షిత, గౌరవ ప్రదమైన నివాసాన్ని కల్పించడమే తమ సర్కారు ధ్యేయమని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు మంత్రి పొంగులేటి వివరించారు.

Updated Date - Feb 22 , 2026 | 07:01 AM