ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు అర్థరహితం
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:21 AM
తమ ప్రజా ప్రభుత్వం ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేస్తోందని, ఈ క్రమంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరంగా అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నాం: మంత్రి పొంగులేటి
ఖమ్మం కలెక్టరేట్/ఇల్లెందు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): తమ ప్రజా ప్రభుత్వం ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేస్తోందని, ఈ క్రమంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరంగా అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలోని తన తన క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మునిసిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని నిలిపేసిందో చెప్పాలని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసిందని, కానీ తమ ప్రభుత్వం తొలిదశలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తోందని, ప్రజలు కూడా ఈప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని చెప్పారు.