రైతు సంగ్రామం కాదు.. బీఆర్‌ఎస్ ఆక్రోశ సభ
ABN , Publish Date - May 07 , 2026 | 05:02 AM
బీఆర్‌ఎస్ వరంగల్‌లో నిర్వహించినది ‘రైతు సంగ్రామ సదస్సు’ కాదని.. అధికారం కోల్పోయిన వారి ఆక్రోశ సభ మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ధ్వజమెత్తారు.
ప్రజలు అసహ్యించుకునేలా కేటీఆర్ వ్యాఖ్యలు.. ఆ సమావేశంలో రైతులే లేరు.. అందరూ కార్యకర్తలే..!
అన్నదాతలకు సంకెళ్లు వేసిన చరిత్ర మీది
నిప్పులు చెరిగిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, నేలకొండపల్లి, మే 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వరంగల్‌లో నిర్వహించినది ‘రైతు సంగ్రామ సదస్సు’ కాదని.. అధికారం కోల్పోయిన వారి ఆక్రోశ సభ మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ధ్వజమెత్తారు. భవిష్యత్తులోనూ అధికారం దక్కదనే భయం, తీవ్ర నిరాశతోనే కేటీఆర్ తెలంగాణ ప్రజానీకం అసహ్యించుకునేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రైతు సంక్షేమాన్ని విస్మరించి.. నేడు రాజకీయ మైలేజీ కోసం మాటల దాడులకు దిగడం వారి నిస్సహాయతకు నిదర్శనమని బుధవారం ఓ ప్రకటనలో మంత్రి ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన చోట రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని మండిపడ్డారు. ఈ సమావేశంలో రైతులు లేరని కేవలం పార్టీ కార్యకర్తలే హాజరయ్యారని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నామని, నెలకు సగటున రూ.5,500 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెలకు రూ.2,533 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ రైతులు నిజాన్ని గుర్తించి తగిన సమాధానం ఇస్తారని మంత్రి స్పష్టం చేశారు. కాగా ఖమ్మం జిల్లా గువ్వలగూడెంలో నిర్వహించిన ‘ప్రజాపాలన - ప్రజాదర్బార్‌లో ఆయన ఎంపీ రఘురాంరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలను ‘భూ భారతి’ ద్వారా ప్రక్షాళన చేస్తున్నామని, పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను రాబోయే 35 రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏం కష్టపడ్డారని రూ.లక్షల కోట్లు సంపాదించారు అని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న మీరు వారికి ఏం చేసారో చెప్పాలని పొంగులేటి కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ప్రశ్నించారు.