డ్రామారావులో పెరుగుతున్న ఫ్రస్టేషన్
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:23 AM
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా కు పడిపోయి.. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ చిత్తుగా ఓటమిపాలవడం...
కేటీఆర్‌కు నా సవాల్ స్వీకరించే దమ్ములేదు: పొంగులేటి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా కు పడిపోయి.. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ చిత్తుగా ఓటమిపాలవడం... వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే అధికారమని స్పష్టమవడంతో డ్రామారావులో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేతల పార్టీ అని, బీఆర్‌ఎస్ చేతకాని పార్టీ అంటూ.. కేటీఆర్‌కు సవాల్‌ను స్వీకరించే దమ్ము లేదంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దాని ప్రకారం.. ‘‘హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలపై తాను చేసిన సవాల్ గురించి ఓ జర్నలిస్ట్ చాలా స్పష్టంగా ప్రశ్న అడిగితే.. దానికి సమాధానం చెప్పలేక, సవాల్‌ను స్వీకరించే దమ్ములేని కేటీఆర్.. మూసుకుని ఇంట్లో కూర్చో అంటూ దొరతనం, అహంకారంతో మాట్లాడుతున్నారు.. మరి సీఎం హోదాలో ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన కేసీఆర్.. మూసుకుని ఫామ్‌హౌ స్‌లో ఉన్న విషయం మీరు మర్చిపోతే ఎలా డ్రా మారావు.. గ్రామాల్లో పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన ఇళ్ల కంటే తొలి రెండున్నర ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించింది. నాలుగో దశలోనూ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎ న్నికల నాటికి హైదరాబాద్ పరిధిలోనూ బీఆర్‌ఎస్ పదేళ్లలో కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ కట్టితీరుతాం. అలాగైతేనే నేను ఎమ్మెల్యేగా పోటీచేస్తా.. ప్రజలను ఓట్లు అడుగుతా.. మరి కాంగ్రెస్ ఎక్కువ ఇళ్లను కడితే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండేందుకు సిద్ధమేనా కేటీఆర్.. చేతనైతే నా సవాల్‌ను స్వీకరించు’’ అంటూ మంత్రి పోస్టు చేశారు.