తాటాకు చప్పుళ్లకు బెదరం
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:01 AM
కొందరి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు ప్రతిపక్ష నేతలు తమకు అంటిన బురదను...
భూభారతితో 3.80 లక్షల మందికి కొత్త పాస్‌పుస్తకాలు
రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు సాయం
పండించిన ప్రతి గింజ కొంటాం
అర్హులైన వారి సొంతింటి కల నెరవేరుస్తాం:పొంగులేటి
హైదరాబాద్/ కూసుమంచి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): కొందరి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు ప్రతిపక్ష నేతలు తమకు అంటిన బురదను అధికార పార్టీకి అంటించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కారు కూతలు కూసినా, ఎన్ని కుట్రలు చేసినా భవిష్యత్‌లోనూ ఇందిరమ్మ ప్రభుత్వాన్నే దీవించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో రూ.1.52 కోట్లతో 2,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) గోదాములను శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ పథకాలకు చెందిన 191 మంది లబ్ధిదారులకు రూ.58.58 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరెన్ని అవాకులూ చవాకులూ పేలినా తమ సర్కారు పేద వారికి అండగా ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు భరోసాగా కల్పించేందుకు భూభారతిని తీసుకొచ్చాక రాష్ట్రంలో 3.80 లక్షల మంది రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు అంద జేశామని పేర్కొన్నారు. భూ భారతితో ప్రతి అంగుళం సర్వే చేసి రైతుల పట్టాదార్ పాస్ పుస్తకంలో భూ సర్వే మ్యాప్ ప్రింట్ చేస్తామన్నారు. తద్వారా భవిష్యత్తులో భూతగాదాలు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. సన్న వడ్లపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న పొంగులేటి.. ధాన్యం కొన్న వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కల సాకారం చేస్తామన్నారు. అనంతరం వెంకటాపురం వాసి శ్రీకాంత్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.