గడప వద్దే ప్రజా సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:23 AM
ప్రజా సమస్యలను వారి గడప వద్ద పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
పాలేరు ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి వెల్లడి
కూసుమంచి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను వారి గడప వద్ద పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహార్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులను ప్రజల వద్దకు పంపించి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘99రోజుల ప్రజాప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తామని తెలిపారు. న్యాయబద్ధమైన సమస్యలను 3నెలల్లో పరిష్కరిస్తామన్నారు. మొదటివిడతగా 4.50లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటికే 90శాతం పూర్తయినట్లు తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భూసేకరణలో పెండింగ్ అంశాలు వారంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూసమస్యల పరిష్కారం కోసం ప్రతీ జిల్లాలో 70గ్రామాల్లో భూ సర్వే చేపడుతామని, రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా సర్వేమ్యాప్ నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూదార్ నెంబర్ ఇచ్చే వ్యవస్ధను ప్రవేశపెట్టామని పొంగులేటి చెప్పారు.