Share News

ధరణి పేరిట భూములు కొల్లగొట్టారు

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:35 AM

ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్ద లు సర్కారు భూములను కాజేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.

ధరణి పేరిట భూములు కొల్లగొట్టారు

  • గత ప్రభుత్వ పెద్దలే సర్కారు భూములను కాజేశారు.. ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఈ విషయం వెల్లడైంది: పొంగులేటి

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్ర జ్యోతి): ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్ద లు సర్కారు భూములను కాజేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఈ విషయం తేలిందన్నారు. ఫోరెన్సిక్‌ ఆడి ట్‌ ప్రాథమిక నివేదిక శనివారం మంత్రి పొంగులేటి చేతికి అందింది. కాగా, ప్రాథమిక నివేదికలో అవినీతి, అక్రమాలు అనేకం జరిగినట్లు తేలిందని, ఈ నివేదికను పరిశీలించిన తరువాత 31 జిల్లాల్లో ఆడిట్‌ నిర్వహిస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భూములు స్వాహా చేసినవారి బాగోతం బయట పెడతామన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లోపాల వల్లనే రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఇటీవల జనగామలో వెలుగులోకి వచ్చిన భూముల రిజిస్ట్రేషన్‌ కుంభకోణంపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీతో సచివాలయంలో శనివారం మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ ద్వారా లోపభూయిష్టంగా ఉన్న ధరణి లోపాలను గుర్తించి సరిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్ములు కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాగా, ధరణి పోర్టల్‌ మొదలైనప్పటి నుంచి 52 లక్షల లావాదేవీలు జరిగాయని, అందులో 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించామని కమిటీ సభ్యులు తెలిపారు. 1109 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.4 కోట్లను ప్రభుత్వానికి చెల్లించలేదని మంత్రికి వివరించారు. మొత్తం లావాదేవీల్లో ఇప్పటి వరకు 35 లక్షల లావాదేవీలను పరిశీలించామన్నారు. కాగా, భూముల రిజిస్ట్రేషన్‌ అక్రమాలు 9 జిల్లాల్లోని 35 మండలాల్లో జరిగాయని మంత్రి తెలిపారు. 48 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు.


నేడు సర్వేయర్లకు లైసెన్స్‌ల అందజేత..

లైసెన్స్‌ సర్వేయర్లకు ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌లో లైసెన్సులు అందజేయనున్నట్లు మంత్రి పొం గులేటి తెలిపారు. 2వేల మందికి లైసెన్సులు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో నక్ష లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ల సంఘం 2026 డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు విక్టర్‌, కార్యదర్శి చంద్రకళ మాట్లాడుతూ అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.

కేటీఆర్‌వి మతి లేని మాటలు

సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ మాట్లాడుతున్న భాష సరిగా లేదని, ఆయన మతి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆక్షేపించారు. కేటీఆర్‌ స్థాయికి సీఎం రేవంత్‌ అవసరం లేదని, తాను సరిపోతానని అన్నారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బట్టకాల్చి మీద వేయడమే ప్రతిపక్షం పని అన్నట్లుగా బీఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అక్రమాలు జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని వారు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఇంకా అధికారంలో ఉన్నట్లు ప్రతిపక్ష నేతల వ్యవహారశైలి ఉందని, మరోసారి అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. మునిసిపల్‌ ఎన్నికలను వ్యక్తిగతంగా తాను రిఫరెండంగానే భావిస్తున్నానని పొంగులేటి చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగిందే ఈ ఎన్నికల్లోనూ జరుగుతుందన్నారు. ఆనాడు సోయి లేకుండా ఇష్టానుసారం జిల్లాలు ఏర్పాటు చేసి.. ఇప్పుడు అగ్నిగుండం చేస్తామని మతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శాస్ర్తీయ పద్ధతిలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేపడతామని చెప్పారు.

Updated Date - Jan 25 , 2026 | 03:35 AM