మార్పు కోరుకుంటున్న మలయాళీలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:29 AM
మలయాళీలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, కేరళంలో ఈ దఫా ఎన్నికల్లో రాజకీయ మార్పు అనివార్యమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ విజయం తథ్యం: పొంగులేటి
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్ర జ్యోతి): మలయాళీలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, కేరళంలో ఈ దఫా ఎన్నికల్లో రాజకీయ మార్పు అనివార్యమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి శనివారం అలెప్పిలోని మన్నన్‌చెరి పంచాయతీ కవుంకల్‌లో జరిగిన ప్రచారంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ దఫా ఎన్నికల్లో మార్పు కోసం మలయాళీలు ఎదురుచూస్తున్నారని వారితో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశమిస్తే తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ మోడల్‌ను కేరళంలోనూ అమలు చేస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కేరళంలోని ప్రస్తుత సర్కారు ప్రజా సమస్యలను పక్కన బెట్టిందన్నారు. బీజేపీని విమర్శించే పేరుతో నాటకాలాడుతోందని పొంగులేటి ఆరోపించారు. బీజేపీ, సీపీఎం కలిసి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.