Share News

సాదాబైనామా దరఖాస్తుల్లో వేగం పెంచాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:27 AM

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సాదాబైనామా దరఖాస్తుల్లో వేగం పెంచాలి

  • జిల్లాకు ఒక మండలంలో భూభారతి అమలు

  • అధికారులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశాలు

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలపై సోమవారం అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఆరు లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వివరించారు. మిగిలిన దరఖాస్తుదారులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. ఆ తరువాత 30 రోజుల్లో గడువు ముగిసిన వెంటనే అర్హులైన దరఖాస్తుదారుల సమస్య పరిష్కరించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు 3.65 లక్షల పాస్‌ పుస్తకాలు జారీ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే మ్యాప్‌ జత చేసే నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వివరించారు. తొలి దశలో అమలు చేసిన ఐదు మండలాల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. రెండో దశలో ప్రతి జిల్లాలో ఒక మండలంలో భూభారతిని అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

Updated Date - Jun 23 , 2026 | 03:27 AM