Share News

హరీశ్‌కు మతి స్థిమితం తప్పింది

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:45 AM

బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. ఆయనకు మతి స్థిమితం తప్పిందేమోనన్న అనుమానం కలుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

హరీశ్‌కు మతి స్థిమితం తప్పింది

  • రెండున్నరేళ్లకే అసెంబ్లీని రద్దు చేస్తామా?

  • మేం చేసే పనులు జీర్ణించుకోలేక కేటీఆర్‌ ఆక్రోశం

  • ఎన్నికల్లో వాళ్లను ప్రజలు శిక్షిస్తున్నారు

  • అధికారంపై బీజేపీది అత్యాశ

  • వారంలోగా రైతు భరోసా నిధులు

  • కొత్త రెవెన్యూ డివిజన్ల ఆలోచన లేదు: పొంగులేటి

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. ఆయనకు మతి స్థిమితం తప్పిందేమోనన్న అనుమానం కలుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు తమకు ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చారని, రెండున్నరేళ్లకే అసెంబ్లీని ఎందుకు రద్దు చేస్తామని ప్రశ్నించారు. గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో గుర్తు లేదా? కొత్తగా ఇచ్చే తీర్పు ఏముంటుంది? అని హరీశ్‌ను నిలదీశారు. సచివాలయంలోని తన చాంబర్‌లో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం చేసే మంచి పనులను జీర్ణించుకోలేక భవిష్యత్తులో అధికారం దక్కదనే ఆవేశం, ఆక్రోశంతో కేటీఆర్‌ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పాలేరులో కేటీఆర్‌ చేసిన విమర్శలు ఇదే కోవలోకి వస్తాయన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించిన ప్రతిసారీ తాను స్పందించబోనని, ఎప్పుడో ఒక సారి కర్రు కాల్చి వాత పెడతానని హెచ్చరించారు. ‘‘కేటీఆర్‌ను అరెస్ట్‌ చేస్తేనే బాంబులు పేలినట్టు కాదు. ప్రజలు ఛీ కొట్టినా బాంబులు పడ్డట్టే. ఎవరిపైనా కక్షపూరిత చర్యలు తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. తప్పుచేసిన వాళ్లను జైలులో వేస్తేనే శిక్షించినట్లు కాదు. ప్రతి ఎన్నికల్లో వాళ్లను ఓడించి ప్రజలు శిక్షిస్తూనే ఉన్నారు. తమిళనాడు వంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రానివ్వబోం’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని పొంగులేటి ఎద్దేవా చేశారు. ఆశ ఉండడంలో తప్పులేదని, కానీ ఆ పార్టీ అత్యాశకు పోతోందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌.. ఒకే తాను ముక్కలని విమర్శించారు. కాళేశ్వరం అవినీతి, థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల అక్రమాలపై సీబీఐ విచారణ కోరితే.. కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను వారంలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 23 స్థలాలను గుర్తించామని తెలిపారు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. భూముల ధరల సవరణకు సంబంధించి ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే.. సరి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.


మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనివ్వం

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి తెలిపారు. హైదరాబాద్‌కు కొత్త జీవం పోసేలా, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందన్నారు. మూసీ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, పునరావాసం తదితర అంశాలపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ కోణంలోనే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి తక్షణమే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుందని తెలిపారు.

Updated Date - Jun 30 , 2026 | 04:45 AM