ఇది పేదల ప్రభుత్వం.. దొరలది కాదు
ABN , Publish Date - May 31 , 2026 | 06:07 AM
ఇది పేదోడి ప్రభుత్వం.. దొరల ప్రభుత్వం కాదు’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని చెప్పారు.
పేదోడికి భద్రత, భరోసా, ధైర్యమిచ్చే సర్కారు
పట్టణ పేదలకు రేవంతన్న కానుకగా ఇందిరమ్మ ఇళ్లు
హైదరాబాద్‌లో తొలి విడతలో లక్ష ఇళ్లు నిర్మిస్తాం
మలి విడతలో మరో లక్ష ఇళ్లు : మంత్రి పొంగులేటి
హైదరాబాద్, బంజారాహిల్స్, మే 30 (ఆంధ్ర జ్యోతి): ‘ఇది పేదోడి ప్రభుత్వం.. దొరల ప్రభుత్వం కాదు’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని చెప్పారు. పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వమని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయ నిర్మాణానికి శనివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దొరలు మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయని, కానీ వేదిక దిగిన తరువాత వాళ్లు చెప్పిన మాటలు గుర్తుండవని ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలి విడతలో లక్ష ఇళ్లు ఇస్తామని.. రెండో విడతలో కూడా లక్ష ఇళ్లు నిర్మిస్తాని తెలిపారు. పట్టణ పేదలకు పెద్దన్న రేవంత్‌రెడ్డి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. గత పాలకుల తరహాలో ప్రజలు ఒక చోట ఇళ్లు 30-40 కి.మీ దూరంలో ఉండేలా తాము చేయబోమన్నారు. రిజిస్ట్రేషన్, సర్వే తదితర శాఖలు ఒకేచోట అందుబాటులోకి తీసుకొచ్చేందుకే సమీకృత భవనాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటు రంగానికి దీటుగా కార్పొరేట్ తరహాలో అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై నిధుల భారం లేకుండా నిర్మాణ పనులను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించినట్లు తెలిపారు. మరికొద్ది నెలల్లో ఫినిక్స్ సంస్థ బంజారాహిల్స్ కార్యాలయాన్ని 30 వేల చదరపు అడుగుల్లో నిర్మించ నుందని చెప్పారు. బంజారాహిల్స్ సమీకృత భవనంలో ఎస్‌ఆర్ నగర్, బంజారాహిల్స్, గోల్కొండ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయం అన్నీ ఒకే ప్రాంగణంలో ఉంటాయన్నారు. . కాగా, ఈ నిర్మాణాలతో సామూహిక ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందంటూ శంకుస్థాపనకు ముందు ముస్లింలు ఆందోళనకు దిగారు. రంజాన్, బక్రీద్‌లకు ఇక్కడే సామూహిక ప్రార్ధనలు నిర్వహించుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు పొంగులేటి హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.