Share News

మునిసిపల్‌ ఎన్నికలు మాకు రెఫరెండమే

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:13 AM

త్వరలో జరిగే మునిసిపల్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రభుత్వం రెఫరెండంగా భావించాలని బీఆర్‌ఎస్‌ నేతలు సవాల్‌ విసురుతున్నారని, దానిని తాను వ్యక్తిగతంగా స్వీకరిస్తున్నానని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

మునిసిపల్‌ ఎన్నికలు మాకు రెఫరెండమే

  • వ్యక్తిగతంగా సవాల్‌ను స్వీకరిస్తున్నా .. బీఆర్‌ఎస్‌ దోచుకున్నది కక్కిస్తాం.. గత పదేళ్లు కమీషన్ల కోసమే పనిచేసింది

  • కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు

  • పేదలకు ఇళ్లు కడితే కమీషన్‌ రాదని వదిలేశారు

  • ట్యాపింగ్‌ వ్యవహారంలో వారికెందుకంత భయం?

  • మంత్రి పొంగులేటి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

త్వరలో జరిగే మునిసిపల్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రభుత్వం రెఫరెండంగా భావించాలని బీఆర్‌ఎస్‌ నేతలు సవాల్‌ విసురుతున్నారని, దానిని తాను వ్యక్తిగతంగా స్వీకరిస్తున్నానని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఇది రెఫరెండం అని చెప్పిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. అయినా బుద్ధిరాకపోగా స్థానిక ఎన్నికల్లో మళ్లీ సవాల్‌ విసిరారని దుయ్యబట్టారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు, వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట, ఖమ్మం జిల్లా ఏదులాపురంలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత పదేళ్లుగా కమీషన్ల కోసం పనిచేసి దాచుకున్నది, దోచుకున్నది కక్కిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఆ ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసమే ఆరాటపడిందని, వాటిపై ఆశతోనే కాళేశ్వరంపై దృష్టి పెట్టి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే రూ.లక్షల కోట్ల కమీషన్లు వస్తాయనే ఆశతోనే దృష్టి పెట్టారని, పేదలకు ఇళ్లు కడితే కమీషన్లు రావనే సాకుతో ఆ పథకాన్ని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. తాగినోడే తాళ్ల పన్ను కట్టాలి అన్న చందంగా చేసిన తప్పులకు ఎప్పుడైనా శిక్ష తప్పదని, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వ్యవహార తీరు చూస్తే గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని విమర్శించారు. ఈ కేసులో ఎలాంటి తప్పు లేకపోతే బీఆర్‌ఎస్‌ నాయకులు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి లాంటి నాయకులు పది మంది ఉన్నారని, వారంతా కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మరో పదేళ్ల పాటు అధికారంలో ఉంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు.

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి

భారత రాజ్యాంగ ప్రపంచానికే ఆదర్శమని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ముందడుగు వేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం వర్థిల్లుతోందని పేర్కొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 04:13 AM