భూ దందా మీది.. నిందలు మా పైనా?
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:58 AM
నాదర్‌గుల్ భూములకు సంబంధించిన దందా పూర్తిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. ఆ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వారి హయాంలోనే జరిగాయన్నారు.
2014లో నాదర్‌గుల్ భూముల రిజిస్ట్రేషన్
మ్యుటేషన్ కూడా బీఆర్‌ఎస్ హయాంలోనే..
3 సంస్థలకు గత ప్రభుత్వమే కట్టబెట్టింది
ఓ నిర్మాణ సంస్థతో డీల్ కుదుర్చుకొని..
ఆ తర్వాత పొంగులేటి కబ్జా అంటూ రాశారు
గుమస్తా పత్రిక వారికి రూ.కోట్లు ముట్టాయి
వట్టినాగులపల్లి వివాదం.. ఆ హోం సంస్థకు,
షా కుటుంబంలోని వ్యక్తికి మధ్య పంచాయితీ
దానిని మా ప్రభుత్వానికి అంటగడుతున్నారు
హరీశ్, కేటీఆర్ ఖబడ్దార్.. మీరు చేసినవన్నీ త్వరలో బయటకొస్తాయి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్ర జ్యోతి): నాదర్‌గుల్ భూములకు సంబంధించిన దందా పూర్తిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. ఆ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వారి హయాంలోనే జరిగాయన్నారు. దందాలన్నీ వారు చేసి.. నిందలు తమ ప్రభుత్వంపై మోపుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన పత్రికలో తొలుత.. జాగీర్‌లోకి ఓ పెద్ద నిర్మాణ సంస్థ అడుగు పెట్టిందంటూ రాశారని, అనంతరం ఆ నిర్మాణ సంస్థతో వారికి డీల్ కుదరడంతో పొంగులేటి కబ్జా అంటూ రాశారని తెలిపారు. వారి బురదను తమ ప్రభుత్వంపై చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ నేతలు భూములను దోచుకున్నారని ఆరోపించారు. పొంగులేటి బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నాదర్‌గుల్ సర్వే నంబరు 613లో ఉన్న 373 ఎకరాలను యునైటెడ్ ల్యాండ్ మార్క్స్, ఆల్ఫా ఎస్టేట్స్, ఒమేగా డెవలపర్స్ అనే మూడు సంస్థలకు 2014 సెప్టెంబరు 1న రిజిస్ట్రేషన్ చేశారు. ఆ డాక్యుమెంట్లను 2016 సెప్టెంబరు 24న మ్యుటేషన్ చేశారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది ఎవరు?’’ అంటూ ధ్వజమెత్తారు. కోర్టు కేసు ఉంటే కనీసం వారు కౌంటర్ వేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కౌంటర్ దాఖలు చేశామని చెప్పారు. పత్రికను అడ్డుపెట్టుకుని అవాస్తవాలు రాస్తున్నారని మండిపడ్డారు.
బావ బావమరుదులు పెద్ద నిర్మాణ సంస్థ అధినేతను రహస్యంగా కలుసుకుని.. వారి వాటాపై స్పష్టత వచ్చాక తనపై నింద మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు భూమిపై కొన్నిసార్లు ప్రభుత్వ భూమి అని, మరికొన్నిసార్లు ప్రైవేటు భూమి అని 2004 నుంచి వివాదాలు నడుస్తున్నాయని పొంగులేటి తెలిపారు. కోర్టు కేసులు నడుస్తున్నాయని, పోలీసుల సహకారంతో భూమిని స్వాధీనం చేసుకున్న సందర్భాలూ గత ప్రభుత్వంలో జరిగాయన్నారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే 3 సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. ఈ ఫైళ్లపై సంతకాలు చేసింది మీరు కాదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. 2021 ఫిబ్రవరి 10న ఆ భూముల్లో రోడ్లు, రేకుల ప్రహరీలు లేవని, 2021 డిసెంబరు 5 నాటి గూగుల్ చిత్రం చూస్తే కొన్నిచోట్ల రోడ్లు, రేకుల ప్రహరీ కనిపిస్తాయని, 2022 జనవరి 17 నాటికి భూమిలో పూర్తిగా రేకులతో ప్రహరీ, రోడ్లు ఏర్పడ్డాయంటూ గూగుల్ చిత్రాలను మంత్రి ప్రదర్శించారు. తమ సర్కారు వచ్చాక నాలా కన్వర్షన్ కోరి తే చేయబోమని తిరస్కరించామన్నా రు. ఈ భూముల వివాదంపై 2022లో కొంత మంది సుప్రీంకోర్టులో కేసు వేస్తే.. నాటి పాలకులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కౌంటర్ దాఖలు చేశారన్నారు. నాదర్‌గుల్ భూముల విషయంలో కేసీఆర్‌కు ఆత్మీయుడైన బీఆర్‌ఎస్ పత్రికలోని ముఖ్యుడికి ఆత్మకు కోట్ల రూపాయలు ముట్టాయన్నారు. మొదటి రోజు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఎంట్రీ అని రాసిన ఆ పత్రిక.. మూడో రోజు పొంగులేటి కబ్జా అని రాయడంలో ఉ న్న ఆంతర్యమేంటి? బావాబామ్మర్దులు ఇద్దరికీ పెద్ద నిర్మాణ సంస్థ అధినేతకు మధ్య రహస్య డీల్ కుదరడం.. వాటా ఇస్తామని హామీ ఇవ్వడం కారణం కాదా? అని ప్రశ్నించారు. శకుని కుమారుడు, మేఘాకు మధ్య డీల్ కుదరడంతో.. తన పరిస్థితేంటని భావించిన అబద్ధాలరావు .. వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని.. భూముల్లో రూ.7 వేల కోట్ల స్కామ్ జరిగిందంటూ తనపై ఆరోపణలు చేశారని చెప్పారు.
నాదర్‌గుల్ భూములు గతంలో 22ఏ జాబితాలో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా 22ఏ జాబితాలోనే ఉన్నాయని తెలిపారు. వట్టినాగులపల్లి భూ వివాదం షా కుటుంబ పంచాయితీ అని పొంగులేటి తెలిపారు. 60-70 ఏళ్ల క్రితం ఆ కుటుంబం భూములు కొనుగోలు చేసిందని, ఆహోం ఈహోం నిర్మాణ సంస్థకు, షా కుటుంబంలోని ఓ వ్యక్తికి మధ్య ఉన్న వివాదాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. ఆహోం ఈహోం నిర్మాణ సంస్థ తీసుకున్న భూమికి పక్కనే ఉన్న భూమిని మరో సంస్థ తీసుకుందని, దాంట్లో తన కుమారుడికి భాగస్వామ్యం ఉండటంతో వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓఆర్‌ఆర్ భూసేకరణ సమయంలో షా కుటుంబం భూమిలో కొంత తగ్గిందన్నారు. ఆ హోం.. ఈ హోం సంస్థ గత పాలకుల అధికార అండతో కొంత స్థలానికి ఫెన్సింగ్ వేసిందని చెప్పారు. వారి వాటాగా 21.28 ఎకరాలను చూపుతున్నారని, అయితే ఓఆర్‌ఆర్‌లో పోయిన భూమి ఈ 21.28 ఎకరాల్లోనే ఉన్నా.. దానిని కాపాడుకునేందుకు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 2023 ఆగస్టు 19న ఈ భూమి 111 జీవో పరిధిలో ఉందని, దానిని ఆ హోం.. ఈ హోం సంస్థ నాలా కన్వర్షన్ చేయించుకుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత పాలకుల సహకారంతో ఈ పని జరిగిందని.. కేసు కోర్టు పరిధిలో ఉందని, త్వరలోనే అన్ని వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. తన కుమారుడిపై కేసు నమోదైనా.. తాను అడ్డుపడలేదని, అది తన చిత్తశుద్ధి అని చెప్పారు.
బడ్జెట్ సమావేశాల్లో పచ్చి అబద్ధాలు చెప్పారు
‘‘బడ్జెట్ సమావేశాల్లో అబద్ధాలరావు, డ్రామారావు పచ్చి అబద్ధాలు చెప్పారు. కొత్వాల్‌గూడ క్రషర్‌కు, రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధం లేదు’’ అని మంత్రి అన్నారు. గతంలో జరిగిన ధరణి అక్రమాలు త్వరలో వెలుగులోకి వస్తాయన్నారు. ‘‘రాఘవ సంస్థ మోచేతి నీళ్లు తాగిన విషయాన్ని మరిచిపోయారా? రూ.కోట్లు పార్టీకి ఇచ్చిన విషయం తెలియదా?’’ అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ అక్రమాలపై విచారణకు సీఎం సీఐడీ విచారణకు ఆదేశించారని, 2014 నుంచి 2026 వరకు ఏం జరిగిందో అన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు. ‘హరీశ్‌రావు, కేటీఆర్ అండర్‌లైన్ చేసుకోండి.. ఖబడ్దార్. నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. గుమస్తా పత్రిక జాతకం కూడా త్వరలో బయటకు వస్తుంది’ అని పొంగులేటి హెచ్చరించారు.