Share News

యథాతథంగా లేటరల్‌ ఎంట్రీ

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:00 AM

పాలిటెక్నిక్‌ విద్యను మరింత బలోపేతం చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించడం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా..

యథాతథంగా లేటరల్‌ ఎంట్రీ

  • ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఎలాంటి ఆటంకం ఉండదు

  • పాలిటెక్నిక్‌ల బలోపేతానికే పునర్వ్యవస్థీకరణ.. పరిశ్రమలతో లింకు.. ఉపాధి లక్ష్యం

  • పాలిటెక్నిక్‌ విద్యను ‘శక్తి’ పరిధిలోకి తేవడంపై మంత్రి వివేక్‌ వెంకటస్వామి వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ విద్యను మరింత బలోపేతం చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించడం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు), గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. దీనివల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్లు ‘లేటరల్‌ ఎంట్రీ’ రద్దు కాబోదని, ఫీజు లు పెరగవని స్పష్టం చేశారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. శక్తి (స్కిల్‌, హ్యూమన్‌ క్యాపిటల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇనీషియేటివ్స్‌) విభాగంలో పాలిటెక్నిక్‌, ఐటీఐల విలీనంపై అధ్యాపకులు, సిబ్బం ది, విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు వివరంగా సమాధానాలు ఇచ్చారు. పాలిటెక్నిక్‌లను కమిషనరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (సీటీఈ) పరిధి నుంచి కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (సీఈటీ) పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జూన్‌ 16న జీఓ 97 జారీ చేసిందని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం పాలిటెక్నిక్‌ విద్యను నిర్వీర్యం చేయడానికో దాని గుర్తింపును మార్చడానికో కాదని, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ కోసం మాత్రమేనని అన్నారు. దీనిపై జేఏసీ ప్రతినిధులతో చర్చించి వారి అభిప్రాయాలు, సందేహాలు, ఆందోళనలను ప్రభుత్వం తెలుసుకుందని చెప్పారు. పాలిటెక్నిక్‌ తర్వాత ఈసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌లో లేటరల్‌ ఎంట్రీ పొందే విధానం యథాతథంగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఏటీసీల్లో ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.2 వేల స్టైపెండ్‌ను పాలిటెక్నిక్‌ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తామని చెప్పారు.


వారు సీఎం ఓవర్సీస్‌ ఎంప్లాయ్‌మెంట్‌ స్కీమ్‌కు కూడా అర్హత పొందుతారని తెలిపారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు, ప్రస్తుతం నిర్ణయించిన ఫీజు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. సాంకేతిక విద్యా శాఖను రెండు విభాగాలుగా పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలిపారు. పాలిటెక్నిక్‌ విభాగం సీఈటీ పరిధిలో ప్రత్యేక యూనిట్‌గా పనిచేస్తుందన్నారు. ప్రవేశాలు, పరీక్షల నిర్వహణను ఈ విభాగమే చూస్తుందని, పరీక్షల విషయంలో తేడా ఉండదని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాలల ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని తెలిపారు. భవిష్యత్తు నియామకాలు టీజీపీఎస్సీ ద్వారానే కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగుల యజమానిగా ఉంటుందన్నారు. పాలిటెక్నిక్‌లను శక్తి పరిధిలోకి తీసుకురావడంవల్ల ఉద్యోగులు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యునివర్సిటీ ఉద్యోగులుగా మారరని స్పష్టం చేశారు. వారు ప్రభుత్వ-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఉద్యోగులుగా మారే ప్రశ్నే లేదన్నారు. పాలిటెక్నిక్‌ విభాగంలోని ప్రస్తుత క్యాడర్లు, ఉద్యోగాల సంఖ్యను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. స్కిల్స్‌ యూనివర్సిటీలో అదనంగా నియామకం, పదోన్నతి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పాలిటెక్నిక్‌ విద్యను పరిశ్రమలతో అనుసంధానం చేయడంలో భాగంగా టాటా టెక్నాలజీస్‌తో పదేళ్ల కాలానికి రూ.2,300 కోట్ల విలువైన అవగాహన ఒప్పందం కుదిరిందని మంత్రి తెలిపారు. ప్లేస్‌మెంట్లు, శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌, ఇంటర్న్‌షిప్‌, కరిక్యులమ్‌ అప్‌గ్రేడేషన్‌ కోసం ఇప్పటికే 200కుపైగా పరిశ్రమలతో ఎంవోయూలు కుదిరాయని చెప్పారు.


ప్రతి పాలిటెక్నిక్‌లో ప్లేస్‌మెంట్‌ సెల్‌

రాష్ట్రంలోని ప్రతి పాలిటెక్నిక్‌లో ప్రత్యేక ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాలిటెక్నిక్‌ కళాశాలల భూములు, భవనాలు, ఆస్తులను స్కిల్స్‌ యూనివర్సిటీకి బదిలీ చేయబోమని స్పష్టం చేశారు. ఎస్బీటెట్‌, ఏఐసీటీఈ, స్కిల్స్‌ యూనివర్సిటీ లెక్చరర్లతో సంయుక్త సమన్వయ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 21 , 2026 | 06:02 AM