Share News

సర్‌ సర్వేలో సమస్యల చిట్టా

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:02 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రీ సర్వేలో భాగంగా ఇళ్ల వద్దకు వస్తున్న కొందరు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు యాప్‌లో ఓటర్ల వివరాలు అందుబాటులో..

సర్‌ సర్వేలో సమస్యల చిట్టా

  • యాప్‌లో లేని కొందరు ఓటర్ల వివరాలు

  • 2002 జాబితాతో పోల్చటంలో ఇబ్బందులు

  • ఓటర్ల మ్యాపింగ్‌ సరిగా జరగలేదని రాజకీయ పార్టీల ఆరోపణ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రీ సర్వేలో భాగంగా ఇళ్ల వద్దకు వస్తున్న కొందరు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు యాప్‌లో ఓటర్ల వివరాలు అందుబాటులో లేవని చెబుతున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ సర్వేపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆల, అదనపు కమిషనర్‌ చంద్రకళ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీల ప్రతినిధులు సమస్యలు ఏకరువు పెట్టారు. వివాహం అనంతరం అత్తవారింటికి వెళ్లిన మహిళా ఓటర్ల మ్యాపింగ్‌లో గందరగోళం నెలకొందని చెప్పారు. ఈ విషయంలో ఏం చేయాలన్నదానిపై బీఎల్‌వోలు సరైన సూచనలు చేయడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో అద్దె ఇళ్లలో ఉండే చాలామంది చిరునామాలు మారుతారని, ఈ క్రమంలో 2002లో ఏ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటు ఉందనే వివరాలు గుర్తుండకపోవచ్చని చెప్పారు. అలాంటివారి ఓట్లు మ్యాపింగ్‌ చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినవారి పేర్లు 2002 ఓటరు జాబితాలో హిందీ, స్థానిక భాషల్లో ఉంటాయని, వాటిని పరిశీలించడంలో బీఎల్‌వోలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకుడు పొన్న వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా కర్ణన్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్లకు ఆంగ్లంలో ముద్రించిన ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేస్తామని తెలిపారు. ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించని ఓటర్ల వివరాలు ముసాయిదా జాబితాలో ఉండకపోవచ్చని చెప్పారు.

Updated Date - Jun 18 , 2026 | 06:03 AM